బాల్య వివాహాన్ని అడ్డుకున్న చైల్డ్‌లైన్ | Caildlain blocking child marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న చైల్డ్‌లైన్

Aug 25 2013 4:18 AM | Updated on Sep 1 2017 10:05 PM

మైనారిటీ తీరని బాలికను 33 ఏళ్ల వ్యక్తికిచ్చి అద్దంకి మండలం శింగరకొండలో వివాహం చేయబోతుండగా ఒంగోలు చైల్డ్‌లైన్ అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో శనివారం అడ్డుకున్నారు.

అద్దంకి, న్యూస్‌లైన్ : మైనారిటీ తీరని బాలికను 33 ఏళ్ల వ్యక్తికిచ్చి అద్దంకి మండలం శింగరకొండలో వివాహం చేయబోతుండగా ఒంగోలు చైల్డ్‌లైన్ అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో శనివారం అడ్డుకున్నారు. వివరాలు.. తాళ్లూరు మండలం తూర్పుగంగవరానికి చెందిన 33 ఏళ్ల గుజ్జుల  వెంకటేశ్వరరెడ్డికి పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన మైనారిటీ తీరని బాలికతో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు.

అద్దంకి మండలం శింగరకొండ ఆలయంలో వివాహం చేస్తుండగా చైల్డ్‌లైన్‌కు సమాచారం అందింది. చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్, ఐసీడీఎస్ కొరిశపాడు సెక్టార్ సూపర్‌వైజర్ మల్లేశ్వరిలు రంగంలోకి దిగి పోలీసుల సహకారంతో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత బాలికను ఒంగోలులోని శిశు మందిర్‌కు తరలించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, ఎవరైనా బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించాలని సాగర్ కోరారు.
 
పందలపాడులో..
 కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని పందలపాడులో బాల్య వివాహం జరగనుందని ఐసీడీఎస్, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందడంతో వారు గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులకు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన యువకునికి ఇచ్చి ఈ నెల 31వ తేదీన వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. మైనర్‌కు వివాహం చేస్తున్నారని సమాచారం అందుకున్న ఐసీడీఎస్ కొండపి ప్రాజెక్టు సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్‌వైజర్ హేమలత, బాలల సంరక్షణ అధికారి ఎం.శ్రీనివాసులు గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం నేరమని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరకుండా పెళ్లి చేయమని వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement