
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు చెందిన మైనారిటీ వలసదారులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించే వార్త చెప్పింది. 2024, డిసెంబర్ 31కి ముందు భారత్‌లోకి వచ్చి, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు చెందిన మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరు 2025, సెప్టెంబర్ 4 నుండి అమలులోకి వచ్చిన భారతదేశ ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం ప్రకారం శిక్షా చర్యల నుండి మినహాయింపు పొందుతారు. ఈ మినహాయింపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని పౌరసత్వ ప్రమాణాలను ప్రభావితం చేయదు.
తాజాగా హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) నోటిఫై చేసిన ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ (మినహాయింపు) ఆర్డర్, 2025 లో ఈ నిబంధనలు పొందుపరిచారు. ఈ చట్టం కింద నేరాలను గుర్తించే అధికారం, చట్టాన్ని అమలు చేసే అధికారాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అప్పగిస్తూ మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్లను జారీ చేసింది.
చట్టం- జరిమానాలు
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే ఏ విదేశీయుడైనా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానాకు అర్హులు. సెక్షన్ 23 ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఎక్కువ కాలం నివసించే విదేశీయులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా రూ. 3 లక్షల జరిమానా విధించనున్నారు.
మినహాయింపుల వివరణ
డిసెంబర్ 31, 2024 లోపు భారతదేశంలోకి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలను నిర్బంధం, బహిష్కరణ చర్యల నుండి ఈ ఆర్డర్ మినహాయింపు కల్పిస్తుంది. ఈ మినహాయింపు 2014, డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేసే సీఏఏ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ గడువులో భారతదేశంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణించరని, వారి పాస్‌పోర్ట్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారతదేశంలోనే ఉండవచ్చని పేర్కొన్నారని ఒక అధికారి తెలిపారు.
చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు విధించే జరిమానాలను కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా లేకుండా అక్రమంగా ప్రవేశించే ఏ విదేశీయునికైనా రూ. 5 లక్షల జరిమానా విధించనున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసించే వారికి ఇమ్మిగ్రేషన్ అధికారి పెనాల్టీ విధిస్తారు. 30 రోజుల వరకు ఉండే వారికి రూ. 10వేలు. 31 నుండి 90 రోజుల వరకు ఉండే వారికి రూ. 20 వేలు జరిమానా విధించనున్నారు. టిబెటన్లు, మంగోలియాకు చెందిన బౌద్ధ సన్యాసులు, అర్హత కలిగిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ వలసదారులకు ఈ జరిమానాలు వర్తించవు.