
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో సోషల్ వర్కర్
క్రౌడ్ ఫండింగ్‌తో పేదలకు చేయూత
పేద మైనారిటీ వర్గాల్లో గట్టి పట్టున్న సల్మాన్‌ఖాన్
ప్రధాన రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్‌పై ప్రభావం
మారుతున్న రాజకీయ సమీకరణలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌కు గండి పడనుందా? అంటే అవుననే రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నియోజక వర్గంలో మైనారిటీ ఓట్లు కీలకం. మొత్తం ఓట్లలో 24 శాతానికిపైగా మైనారిటీ ఓటర్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పాటు మజ్లిస్ పార్టీకి మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. ఈసారి మజ్లిస్ ఉప ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటు బ్యాంక్‌తో పాటు మజ్లిస్ ఓటు బ్యాంక్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక బీఆర్‌ఎస్ మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల బరిలో సోషల్ వర్కర్ సల్మాన్‌ఖాన్ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ప్రధాన ప్రక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. స్థానికుడైన సల్మాన్ క్రౌడ్ ఫండింగ్‌తో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో నిరుపేద మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. యువత ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సల్మాన్ ఎన్నికల బరిలో ఉంటే మొత్తం మీద 20 శాతంపైగా కుటుంబాలు అతని వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మైనారిటీ ఓటర్లు 96 వేలపైనే
జూబ్లీహిల్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల ఓటర్లు ఉండగా అందులో 96 వేలపైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీంతో మైనారిటీ ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా మారారు. మజ్లిస్ పార్టీ గతంలో పాగా వేసేందుకు ప్రయతి్నంచింది. మొదటి సారి 2014 ఎన్నికలలో నవీన్ యాదవ్‌ను బరిలో దింపగా 41,656 ఓట్లు దక్కించుకొని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో దోస్తీ కారణంగా పోటీకి దూరం పాటించడంతో నవీన్ యాదవ్ పారీ్టకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో ఆయనకు 18,817 ఓట్లు వచ్చాయి.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌ను ఎన్నికల బరిలో దింపినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్దిగా భారత క్రికెటర్ దిగ్గజం అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగడంతో మైనారిటీ ఓట్లు చీలిపోయాయి. బీఆర్‌ఎస్‌కు మైనారిటీ ఓటు బ్యాంక్ కలిసి రావడంతో ఎన్నికల్లో గట్టెక్కగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసిన నవీన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉన్నా.. సోషల్ వర్కర్ సల్మాన్ ఎన్నికల బరిలో దిగడం మింగుడు పడని అంశంగా తయారైంది.