ఎస్‌ఎంఎస్‌తో బస్సు వేళలు | Bus Timings with SMS | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంఎస్‌తో బస్సు వేళలు

Dec 29 2014 1:07 AM | Updated on Oct 22 2018 2:17 PM

ఎస్‌ఎంఎస్‌తో బస్సు వేళలు - Sakshi

ఎస్‌ఎంఎస్‌తో బస్సు వేళలు

ఆర్టీసీ బస్సులు సరిగ్గా ఏ వేళకు వస్తాయో తెలుసుకోవడం కష్టం.

  జీపీఎస్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు
  ఆర్టీసీ సరికొత్త ప్రయోగం
  సిటీ వోల్వో బస్సులతో మొదలు
  కొద్దిరోజుల్లో ఫోన్ నంబర్ కేటాయింపు
  త్వరలో అన్ని బస్సులకు విస్తరించే యోచన

 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు సరిగ్గా ఏ వేళకు వస్తాయో తెలుసుకోవడం కష్టం. బస్టాండులోకి అవి ఎప్పుడు వస్తాయో ఒక్కోసారి అధికారులకే అంతుబట్టదు. కానీ ఇప్పుడు ఈ వేళలను కచ్చితంగా చెప్పటమే కాదు... ఆయా బస్సులు ఎక్కాల్సిన ప్రయాణికులు అవి బస్టాండులోకి కచ్చితంగా ఎంతసేపటిలో వస్తాయో ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. బస్సుల్లో జీపీఎస్, జీపీఆర్‌ఎస్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో... బస్సులు సరిగ్గా ఎక్కడున్నాయో, అవి బస్టాండ్లలోకి చేరటానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవటం అధికారులకు సులభంగా మారనుంది. కేవలం వాటి వివరాలను తాము తెసుకుకోవటం కోసం ఉద్దేశించిన ఈ ఆధునిక పరిజ్ఞాన వ్యవస్థను ప్రయాణికులకు సమాచారం అందజేసేందుకు కూడా వినియోగించాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోసం తొలుత భాగ్యనగరంలో తిప్పుతున్న మెట్రోలగ్జరీ ఏసీబస్సులతో ప్రారంభించబోతున్నారు.

 ఎస్‌ఎంఎస్ చేస్తే చాలా సమాచారం
 ఇటీవలే ఆర్టీసీ 80 వోల్వో బస్సులను ప్రీమియం కేటగిరీ సర్వీసులుగా నగరంలో ప్రవేశపెట్టింది. వీటన్నింటిని జీపీఎస్, జీపీఆర్‌ఎస్‌లతో అనుసంధానించింది. దీంతో ఆ బస్సులెక్కడున్నాయి, ఏ ప్రాంతం వైపు పయనిస్తున్నాయి, అవి గమ్యస్థానానికి ఎంతసేపటిలో చేరతాయో కచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు. దూర ప్రాంతాల మధ్య ఇవి తిరుగుతున్నందున ప్రయాణం సులభంగా, సౌఖ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారికోసం కొత్తగా ఎస్‌ఎంఎస్ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. తాము ఎక్కాలనుకున్న బస్సు నిర్ధారిత బస్టాప్‌లోకి ఎంతసేపటిలో వస్తుందో నిమిషాలతో సహా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును ప్రయాణికులకు కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎంసీ సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇది సిద్ధం కావటంతో త్వరలో దాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

ప్రయాణికులు ఎస్‌ఎంఎస్ పంపేందుకు ప్రత్యేకంగా ఓ నంబర్‌ను మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా అందిన సమాచారం మేరకు ప్రయాణికులు సరిగ్గా బస్సు వచ్చే వేళకు బస్టాప్‌నకు చేరుకునే వీలు చిక్కుతుంది. త్వరలో జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లో కూడా జీపీఎస్, జీపీఆర్‌ఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ఈ ఎస్‌ఎంఎస్ విధానాన్ని వాటిల్లో కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement