‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు సంఘీభావంగా బంద్ | Sakshi
Sakshi News home page

‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు సంఘీభావంగా బంద్

Published Sun, Sep 8 2013 4:43 AM

bundh called in support of save andhrapradesh

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల బంద్ పాటించారు. జేఏసీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార సంస్థలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు మూయించారు.
 
 ఉదయం నుంచి పట్టణంలో ఆటోలు తిరుగకుండా కట్టడి చేశారు. ముందుగానే బంద్‌కు సహకరించాల్సిందిగా ఆటో యూనియన్ నాయకులకు చెప్పారు. గూడెం యూనియన్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలను పట్టణంలో ఆపేశారు. గర్భిణులు, రోగులు, వృద్ధులు ఆటోల్లో ఉంటే వాటికి మినహాయింపునిచ్చారు. లోడు లారీలను పట్టణంలోకి రాకుండా వెనక్కి పంపారు. పాలు, నీరు, గ్యాస్ వంటి నిత్యావసరాలతో వెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఆటోలు, బిల్డింగ్ కార్మికుల యూనియన్, మైనార్టీల అసోసియేషన్ తదితర సంఘాలు, విద్యార్థులు బంద్‌కు సహకరించారు. జేఏసీ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. బంద్‌కు వైసీపీ మద్దతు ప్రకటించింది.
 
 గుమ్మలూరులో...
 గుమ్మలూరు (పోడూరు) : గుమ్మలూరులో శనివారం యూత్ జేఏసీ ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో పాఠశాలలు, పోస్టాఫీసు, బ్యాంకు, దుకాణాలను మూయించివేశారు. గుమ్మలూరు-వల్లూరు ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. యూత్‌జేఏసీ నాయకులు విప్పర్తి ప్రభాకరరావు, వర్ధనపు శ్రీనివాస్, వడ్లపాటి సుధాకర్ తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు.
 
 భీమవరంలో...
 భీమవరం : నాన్‌పొలిటికల్ జేఏసీ పిలుపుమేరకు పట్టణంలో శనివారం బంద్ పాటించి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావం తెలిపారు. వ్యాపార, విద్య, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జేఏసీ నేతలు, విద్యార్థి ఐక్య కారణ సమితి (ఐకాస) నేతలు బంద్‌ను పర్యవేక్షించారు.  
 

Advertisement
Advertisement