బ్రూడింగ్ ప్రక్రియే కీలకం

బ్రూడింగ్ ప్రక్రియే కీలకం - Sakshi


పునాది గట్టిగా ఉంటేనే భవనం బలంగా ఉంటుంది. అలాగే బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో చిన్నపిల్లలు (చిక్స్) విషయంలో తీసుకునే జాగ్రత్తల మీదే కోళ్ల ఎదుగుదల ఆధారపడి ఉంది. అతిసున్నితమైన బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో అత్యంత కీలకమైంది బ్రూడింగ్ (ఉష్ణోగ్రత కల్పించడం). కోడిపిల్లలకు తొలిరోజు నుంచి 27 రోజుల పాటు అవసరమైన ఉష్ణోగ్రతలో పెంచాల్సి ఉంటుంది. బ్రూడింగ్ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి కోడి త్వరితగతిన ఎదుగుదల, అధిక బరువు వచ్చే అవకాశముందని పశుసంవర్ధక శాఖ రాజమండ్రి సహాయ సంచాలకులు డాక్టర్ మోటూరి రామకోటేశ్వరరావు (99899 32842) చెబుతున్నారు. బ్రూడింగ్ విధానంపై ఆయన మాటల్లో...           

- అమలాపురంబ్రాయిలర్ పిల్లలకు సరిపడా  వెచ్చదనం అవసరం

వర్షాకాలం, శీతాకాలాల్లో అవసరమైన ఉష్ణోగ్రతలలో కోడిపిల్లలను ఉంచాల్సి ఉంది. గది మొత్తం బ్రూడింగ్ ఒక రకమైతే, స్పాట్ బ్రూడింగ్ రెండో రకం. కోడి పిల్లలు సంఖ్య, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి స్పాట్ బ్రూడింగా లేక గది మొత్తం బ్రూడింగ్ అందించాలా అనేది రైతులు నిర్ణయించుకోవాలి.

 

విద్యుత్ బల్బులతో బ్రూడింగ్

మన రాష్ట్రంలో నూటికి 90 శాతం మంది రైతులు విద్యుత్ బల్బులతో కోళ్ల ఫారాల్లో ఉష్ణోగ్రతను కల్పిస్తారు. ఉన్నంతలో ఇది తక్కువ పెట్టుబడి కావడంతో పాటు ప్రమాదం తక్కువ.

కోడిపిల్లలను ఉంచిన గది చుట్టూ బరకాలు కప్పి గాలి ప్రసరణను నియంత్రించాలి. మధ్యలో అవసరమైన స్థాయిలో విద్యుత్ బల్బులను ఏర్పాటు చేసుకోవాలి. బల్బులు కోడిపిల్లల సంఖ్యను బట్టి అమర్చుకోవాలి.

రేకును గొడుగు ఆకారంలో తయారు చేసి వాటికి బల్బులు తగిలించడమనేది మరింత ప్రయోజనకరం. ఇలా చేయడం వల్ల తక్కువ వాల్ట్ విద్యుత్ బల్బులతో ఎక్కువ ఉష్ణోగ్రతను అందించే అవకాశం ఉంది.నిప్పులతో బ్రూడింగ్

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో బ్రాయిలర్ కోళ్లు పెంచే రైతులు నిప్పులతో బ్రూడింగ్ కల్పిస్తారు.

మట్టికుండలు, ఆయిల్‌రేకు డబ్బాలకు చిల్లులు పెట్టి వాటిలో నిప్పులు వేసి కోడిపిల్లలకు అవసరమైన ఉష్టోగ్రత అందేలా చేసుకోవచ్చు.

కోడిపిల్లల సంఖ్యను బట్టి వీటిని ఏర్పాటు చేసుకోవాలి.

ఉష్ణోగ్రత పెరిగి కోడిపిల్లలు కుండలు, డబ్బాలకు దూరంగా వెళితే ఒకదాని తరువాత ఒకటి కుండలను లేదా డబ్బాలను తీసివేయాలి.

దీని వల్ల ఖర్చు తగ్గినా నిప్పు రాజుకుంటే అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదముంది. వీటి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

 గ్యాస్‌తో మండే బ్రూడర్

ఇది చాలా నాణ్యమైన పద్ధతి. నిర్వహణ వ్యయం తక్కువ.

గ్యాస్ బర్నర్‌లు 1.8 నుంచి 2.4 మీటర్ల వైశాల్యం కలిగి ఉంటాయి. వీటిని 60 సెంటీమీటర్ల ఎత్తులో వేలాడదీయాలి. ఒక బ్రూడర్‌లో 500 నుంచి 750 కోడి పిల్లలను బ్రూడింగ్ చేయవచ్చు.

కోడి పిల్లలు వయసు పెరిగే కొద్దీ బర్నర్ ఎత్తు పెంచాలి. అయితే వీటి వల్ల గదిలో తేమశాతం పెరుగుతుంది.

 వేడి నీటి బాయిలర్

పశ్చిమ దేశాల్లో చాలా బ్రాయిలర్ ఫారాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో కూడా కొంతమంది రైతులు ఈ పద్ధతిలో బ్రూడింగ్ చేస్తున్నారు.

93 డి గ్రీల నుంచి 98 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి నీటిని 50 మిల్లీమీటర్ల నలుపు ఇనుప గొట్టాల ద్వారా పంపడంతో వేడిని కల్గించవచ్చు. సుమారుగా మీటరుకు 200 వాట్ వేడిని ఇవ్వవచ్చు.

వేడి నీటి గొట్టాలను కోడిపిల్లల గదిలో గోడల మీద తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయాలి. తక్కువ ప్రదేశంలో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తక్కువ ఇంధనంతో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

 

స్పాట్ బ్రూడింగ్

ఈ పద్ధతిలో సంప్రదాయక డేరాను ఉపయోగించి వేడిని ఇచ్చే దీపాలు పెట్టి బ్రూడింగ్ చేస్తారు. సాధారణంగా ఒక బ్రూడర్ కింద 1,000 పిల్లలను 5ఐదు ఇన్‌టూ ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో (ఒక చదరపు మీటరుకు 40 పిల్లలు చొప్పున) బ్రూడింగ్ చేయవచ్చును.

బ్రూడర్‌కు కొద్ది దూరంలో నలువైపులా లేదా వృత్తాకారంలో దడి ఏర్పాటు చేస్తే కోడిపిల్లలు దూరంగా వెళ్లకుండా ఉంటాయి. బ్రూడింగ్ ప్రదేశం వైశాల్యం, కోడి పిల్లల సాంద్రత అనుసరించి తగినన్ని నీటి, దాణా తొట్టెలు ఏర్పాటు చేయాలి.

కోడి పిల్లలు వేడిని ఇచ్చే పరికరానికి దూరంగా వెళ్లడం, లేదా దగ్గరకు రావడం ద్వారా తమకు నచ్చిన ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకుంటాయి. సరైన బ్రూడింగ్ ఉష్ణోగ్రత వద్ద కోడిపిల్లలు ఆహారాన్ని, నీటిని ఉత్సాహంగా తీసుకుంటాయి.

కోడిపిల్లలు చేసే శబ్ధం వీటి సౌకర్యస్థితిని తెల్పుతాయి. కోడిపిల్లలు బ్రూడింగ్ ప్రదేశం అంతా సమానంగా విస్తరించకపోతే ఉష్ణోగ్రత సరిపోయినంతగా లేనట్లు. బ్రూడింగ్ పరికరానికి దూరంగా గుమిగూడితే ఉష్ణోగ్రత ఎక్కువైనట్లు తెలుసుకుని ఉష్ణోగ్రతను సరి చేయాలి.

వేడిని ఇచ్చే బ్రూడింగ్ పరికరం ఎత్తును పైకి, కిందకు మార్చడం ద్వారా ఉష్ణోగ్రత స్థాయిని బ్రూడింగ్ ప్రదేశంలో నియంత్రించవచ్చు.

 

గది మొత్తం బ్రూడింగ్

ఈ పద్ధతి ఎక్కువ సంఖ్యలో కోడిపిల్లలను బ్రూడింగ్ చేయవచ్చు. ఒక గదిలో ఉష్ణోగ్రత తేడా లేకుండా అంతా సమానంగా ఉంటుంది. మొత్తం గది అంతా బ్రూడింగ్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.

వేడినిచ్చే పరికరం మరింత పెద్దదిగా, గది మొత్తం వేడినిచ్చేలా వ్యాప్తి చెంది ఉంటుంది. కాబట్టి కోడిపిల్లలు వాటికి కావలసిన ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అవసరాన్ని బట్టి గదిలో కొన్ని ప్రదేశాల్లో కొద్దిపాటి వేడినిచ్చే పరికరాలను అదనంగా ఏర్పాటు చేసుకోవచ్చును.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top