ప్రేయసి చున్నీతోనే ఉరి | Boy Suicide With Girl Dupatta | Sakshi
Sakshi News home page

ప్రేమ మిగిల్చిన విషాదం

Apr 6 2019 4:08 PM | Updated on Jul 12 2019 3:31 PM

Boy Suicide With Girl Dupatta - Sakshi

చెట్టుకు ఉరి వేసుకున్న ప్రవీణ్‌

కంప్యూటర్‌ కోచింగ్‌ కేంద్రంలో ప్రారంభమైన పరిచయాన్ని ప్రేమగా మార్చాలనుకున్నాడు. మనద్దిరం ప్రేమించుకుందామని...భవిష్యత్‌లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. వయసులో తనకంటే చిన్నవాడివని అది కుదిరే పని కాదని ఆ యువతి పదే పదే నచ్చచెబుతూ వచ్చింది. ఇంతలో ఆ యువతికి పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. తనకు పెళ్లి కుదిరిందని ఆ పెళ్లికి తాను అంగీకారం కూడా తెలిపానని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఓసారి మాట్లాడాలని పిలిచి, పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశాడు.  

ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకుంటానని ఆ యవతి స్పష్టం చేయడంతో ఆ యువకుడు కాస్త దూరం వెళ్లి ఆమె మెడలో ఉన్న చున్నీతో చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయబ్రాంతులకు లోనైన యువతి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏం చేయాలో తెలియక మృతదేహం వద్ద ఒంటరిగానే కూర్చుని రోదించింది. దీంతో చుట్టు పక్కల పంట పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలు అక్కడకు వచ్చి ఆమెను వారించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన పట్టణంలోని రైల్వేస్టేషన్‌ దాటి ఆరుఖానాలు సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటలు సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
 

చీపురుపల్లి: మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్‌(17) అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి చీపురుపల్లిలోని ఓ కంప్యూటర్‌ కోచింగ్‌ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ దాదాపు ఆరు నెలలు క్రితం వారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చాలని ప్రవీణ్‌ ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కంటే ప్రవీణ్‌ ఏడాది వయస్సులో చిన్న కావడంతో ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది.

అయినప్పటికీ వెంటపడి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను అంగీకరించాలని కోరినట్టు చెబుతున్నారు. ఇంతలో ఆ యువతికి ఇంట్లో పెద్దలు వివాహం కుదిర్చారు. దీంతో ఆమె కూడా పెళ్లికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న ప్రవీణ్‌ ఆ పెళ్లి రద్దు చేసుకోవాలని కోరుతున్నా ఆమె పట్టించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తూ వచ్చింది.

మాట్లాడేందుకు రమ్మని....

ఇదిలా ఉండగా చీపురుపల్లి శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాట్లాడుకుందాం రమ్మని ప్రవీణ్‌ ఆ యువతిని పిలిచినట్టు తెలిసింది. అయితే ఆ యువతి వెళ్లిన సమయానికి ప్రవీణ్‌ అక్కడ లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని తిరిగి ఆ యువతి వెనుదిరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రవీణ్‌ తాను వచ్చానని రమ్మని ఫోన్‌లో పిలిచాడు. దీంతో ఆ యువతి వెళ్లగా అమ్మవారి ఆలయం నుంచి పొలాలు గుండా ఆరుఖానాలు వైపు నడుచుకుంటూ వచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని మరోసారి కోరాడు.

అలా కుదరదని ఆ యువతి నచ్చజెప్పింది. దీనికి మనస్తాపం చెందాడు. కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని అక్కడే కూర్చోమని, ఎండగా ఉంది చున్నీ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆమె చున్నీ పట్టుకుని వెళ్లి చాలా సేపు తరువాత ఫోన్‌ చేసి ఇదే ఆఖరి మాట గుడ్‌బై అని ఫోన్‌ పెట్టేసాడు. దీంతో ఆ యువతి పరుగులు తీసి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ యవతి కన్నీరు మున్నీరుగా విలపించింది.

దర్యాప్తు చేస్తాం....

మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్‌ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందింది. వెంటనే సిబ్బందిని పంపించాం. అప్పటికే యువతి అక్కడ రోదిస్తూ ఉంది. దర్యాప్తు చేస్తున్నాం. ఆ యువతి వాంగ్మూలం కూడా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.
– ఐ.దుర్గాప్రసాద్, ఎస్‌ఐ, చీపురుపల్లి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement