బాలుడి మరణానికి కారణమేంటి?

A Boy Dies By Doctors Negligence - Sakshi

సాక్షి, నరసన్నపేట : మండలంలోని మడపాం గ్రామానికి చెందిన సింగారపు రోహిత్‌(3) శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందిన ఘటనపై శ్రీకాకుళం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై సీఐ శంకరరావు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం విచారణ ప్రారంభించారు. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు..ఈ నెల 20వ తేదీన మడపాంకు చెందిన సింగారపు ఈశ్వరమ్మ తన మూడేళ్ల కుమారునికి జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని విజయహర్ష ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు సాయంత్రం వరకు డాక్టర్లు జ్వరం కోసం వైద్యం చేశారు.

అయితే రాత్రికి బాలుడికి కడుపు నొప్పి రావడంతో తల్లి వైద్యులకు చెప్పగా కడుపు నొప్పి తగ్గేందుకు డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే ఇంజెక్షన్లు వికటించడంతో 30 నిమిషాల్లో బాలుడు మృతి చెందాడని తల్లి ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజెక్షన్‌ చేస్తున్నప్పుడు బాలుడు ఇబ్బంది పడుతున్నా వైద్యులు పట్టించుకోకుండా, తన కుమారుడిని అన్యాయంగా చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై శ్రీకాకుళం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్లో 23వ తేదీన ఫిర్యాదు చేశామని, 25వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.

మడపాంలో పంచనామా
ఈ సంఘటనపై మడపాంలో శ్రీకాకుళం సీఐ శంకరరావు ఆధ్వర్యంలో బుధవారం పంచనామా నిర్వహించారు. గ్రామ పెద్దలు, బాలుడి తల్లిదండ్రుల నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఖననం చేసిన బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి వైద్యులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. విచారణలో సీఐతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌కుమార్, వీఆర్వో శ్యామ్, గ్రామ పెద్దలు సుందరరావు, రుప్ప సీతారాం, ప్రగడ గోపి తదితరులు పాల్గొన్నారు.

మా బాబుని అన్యాయంగా చంపేశారు 
నేను చూస్తుండగానే తన బాబు మృతి చెందాడని, దానికి ఆస్పత్రి వైద్యులే కారణమని సింగారపు ఈశ్వరమ్మ విలపించారు. సిబ్బందిని నిలదీస్తే రూ.60 వేలు ఇచ్చారని, వైద్యానికి కూడా డబ్బులు తీసుకోలేదన్నారు. ఇలా ఎంతమందిని చంపేసి డబ్బులు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై సక్రమంగా దర్యాప్తు నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top