ఆ కిరాతకుడికి ఉరే సరి..

Bombay High Court to uphold the sessions court verdict on Anuhya Murder Case - Sakshi

అనూహ్యపై అత్యాచారం,హత్య కేసులో సెషన్స్‌ కోర్టు తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పు 

నిందితుడిపై కనికరం చూపాల్సిన అవసరంలేదని స్పష్టీకరణ

కృష్ణా జిల్లాకు చెందిన యువతిపై ముంబైలో 2014లో ఘోరం

ఫలించిన అనూహ్య తల్లిదండ్రుల సుదీర్ఘ పోరాటం

సాక్షి, మచిలీపట్నం/కోనేరుసెంటర్‌: రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనూహ్యపై ముంబైలో జరిగిన అత్యాచారం, దారుణ హత్య కేసు విషయంలో నిందితుడికి ఉరి శిక్షను సమర్థిస్తూ గురువారం బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. అత్యంత దారుణమైన ఈ కేసులో నిందితుడిపై ఎలాంటి కనికరం చూపించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నందున నిందితుడికి మరణ శిక్ష సరైందేనని పేర్కొంది. దీంతో న్యాయం కోసం నాలుగేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న అనూహ్య తండ్రి, కుటుంబ సభ్యులు తీర్పును స్వాగతించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబుల్‌ కాలనీకి చెందిన ఎస్తేరు అనూహ్య (22) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ముంబైలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సాధించింది. 2013 డిసెంబర్‌లో క్రిస్మస్‌ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య నూతన సంవత్సర వేడుకలు సైతం తల్లితండ్రులు, చెల్లితో కలసి ఆనందంగా జరుపుకుంది. అనంతరం 2014 జనవరి 5న ఉద్యోగరీత్యా ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యింది. మరుసటి రోజు అనూహ్య ముంబైలోని తన హాస్టల్‌కు చేరుకోకపోవడంతో, విషయం తెలుసుకున్న తండ్రి అక్కడ తమ బంధువులకు విషయం చెప్పాడు. పలు చోట్ల బంధువులు గాలింపు చేపట్టినా, ఫలితం లేకపోవడంతో ముంబై పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగరం మొత్తం జల్లెడ పట్టారు. అనూహ్య సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గాలించడంతో జనవరి 16న ముంబై– పూణే హైవే పక్కన ఉన్న పొదల్లో కాలి బూడిదైన అనూహ్య మృతదేహం కనిపించింది. 

పట్టించిన సీసీ కెమెరాలు
అనూహ్య హత్యకేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు.. రైల్వేస్టేçషన్‌లో లభ్యమైన సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య కేసులో ముంబైకి చెందిన పాత నేరçస్తుడు చంద్రభానుసనాప్‌ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జాప్యం నెలకొనడంతో అనూహ్య తండ్రి జోనాథన్‌ ఢిల్లీ వెళ్లి ప్రత్యేక వినతిపై కేంద్ర హోం మంత్రిని ఆశ్రయించాడు. దీంతో స్పందించిన ఆయన మహారాష్ట్ర హోం మంత్రికి కేసును సిఫార్సు చేస్తూ లిఖితపూర్వకంగా లేఖ రాసి పంపారు. అక్కడి నుంచి అనూహ్య హత్య కేసు    దర్యాప్తు వేగవంతమైంది. విచారణ పూర్తి చేసిన ముంబై పోలీసులు 2015 డిసెంబర్‌లో హంతకుడు చంద్రభాను సనాప్‌ను సెషన్స్‌ కోర్టులో పక్కా సాక్ష్యాధారాలతో హాజరుపరచగా కోర్టు ఉరి శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ.. హంతకుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. వాదోపవాదనలు విన్న హైకోర్టు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గురువారం చంద్రభాను సనాప్‌కు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top