విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణారంగారావుతో పాటు ఆయన సోదరుడు శ్రీకాకుళం పార్లమెంటరీ నియెజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనలు ...
విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణారంగారావుతో పాటు ఆయన సోదరుడు శ్రీకాకుళం పార్లమెంటరీ నియెజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనలు పార్టీని వీడి వెళ్లే ఆలోచనలో లేరని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా వారు పార్టీ మారుతారంటూ వినిపిస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు.
శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. తాను, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్ కలసి బొబ్బిలి రాజులతో శుక్రవారం మాట్లాడినట్లు చెప్పారు. అవన్నీ అసత్య ప్రచారాలేనని ఖండించారని, పార్టీ మారే ఆలోచన లేదన్న విషయాన్ని వారు స్పష్టం చేశారని చెప్పారు. జిల్లాలో ఇటీవల నూతన సమీకరణాలు చోటుచేసుకున్నప్పటికీ వారు పార్టీ సిద్ధాంతాలకు, అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్‌కృష్ణరంగరావు మూడు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు.
తప్పు చేసిన రేవంత్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు...?
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు సస్పెండ్ చేయలేదని కోలగట్ల ప్రశ్నించారు. పైగా రేవంత్‌రెడ్డి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి సకుటుంబ సపరివారసమేతంగా వెళ్లి పరోక్షంగా మద్దతు తెలపడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలను, అవినీతి రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు బాధ్యత గల ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ టీడీపీ అవినీతి రాజకీయాలను బట్టబయలు చేస్తే.. వీరంతా జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించటం తగదన్నారు. రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్‌పై లోక్‌సత్తా, సీపీఐ, సీపీఎం నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. వారిని ఏమీ అనకుండా జగన్‌మోహన్‌రెడ్డిపైనే అసత్యప్రచారాలను చేయడాన్ని ఖండించారు. టీడీపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తమ పార్టీ విధి విధానాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు హమీలను గుప్పించి ఇప్పుడు వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తున్న టీడీపీ పార్టీ విధి విధానాలు ఏంటని కోలగట్ల ప్రశ్నించారు.