ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ ! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ !

Published Thu, Aug 28 2014 12:57 AM

ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ !

 • విద్యాశాఖ కసరత్తు   
 •   ఉపాధ్యాయుల హాజరుశాతం పెంచేందుకే
 •   ఫలితంగా నాణ్యత ప్రమాణాల పెంపు
 •   వ్యతిరేకిస్తున్న  ఉపాధ్యాయ సంఘాలు
 • సాక్షి, విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల విధులు, తరగతుల బోధన, హాజరుశాతం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని నిశితంగా పరిశీలించడానికి సన్నాహాలు చేస్తోంది.

  నిర్దేశిత సమయం కల్లా ఉపాధ్యాయులు విధులకు హాజరు కావడం లేదనే అపవాదు ఉంది. దీంతో నూతన పద్ధతి ద్వారా ఉపాధ్యాయుల హాజరును నిశితంగా పరిశీలించి సకాలంలో పాఠశాలకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవడానికి  కసరత్తు  చేస్తోంది. దీని అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో జిల్లా విద్యాశాఖ అధికార గణం నిమగ్నమై ఉంది.  విద్యాశాఖలో నాణత్య ప్రమాణాలు పెంపులో భాగంగానే ఈ చర్యలని అధికారులు చెబుతున్నారు.

  జిల్లాలో మొత్తం 3,340 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 2,768 ఉన్నాయి. మిగిలినవి ఎయిడెడ్ పాఠశాలలు. అలాగే ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్యాభోధన చేసే పాఠశాలలు 440 ఉన్నాయి. వీటిలో 370 ప్రభుత్వ పాఠశాలలు కాగా 70 ఎయిడెడ్ పారశాలలున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో  1వతరగతి నుంచి 10 వతరగతి వరకు చదివే విద్యార్థులు 3.20 లక్షల మంది ఉన్నారు.  జిల్లాలోని ప్రయివేట్ పాఠశాలల్లో 2.6 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 వేల మంది టీచర్లు వివిధ కేటగిరిల్లో పనిచేస్తున్నారు.

  గత మూడేళ్లుగా ఉత్తీర్ణతా శాతం పెంపు కోసం జిల్లా విద్యాశాఖ అనేక నూతన మార్గాలు అనుసరిస్తోంది.  ఈ విధానం వల్ల నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించడంతో పాటు ఉపాధ్యాయుల్లో సమయపాలన పెరుగుతుందని తద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చనే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖమంత్రి, సీఎం సానుకూలంగా స్పందించి దీనిని ప్రవేశపెడతామని ప్రకటించారు.
   
  మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ...
   
  జిల్లాలోని 3,340 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టం  ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరపాలకసంస్థలు, వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో ఈవిధానం అమలులో ఉంది. జిల్లాలో 12 వేల మంది టీచర్లు ఉండటంతో అందరి హాజరుశాతాన్ని నిశి తంగా పరిశీలించడం అధికారులకు కష్టతరంగా  మారింది. ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని ఆయా పాఠశాలల హెచ్‌ఎం నిత్యం పరిశీలించి, నెలకోసారి ఎంఈవోకు నివేదిస్తారు. అక్కడ నుంచి డివిజన్ విద్యాధికారికి, అక్కడినుంచి నుంచి జిల్లా విద్యాధికారికి చేరతాయి. జిల్లాలో సగటున ఉపాధ్యాయుల హజరుశాతం ప్రస్తుతం 90 శాతంపైనే ఉంది. అయితే ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.  
   

Advertisement
 
Advertisement