జై భవానీ... జైజై భవానీ

జై భవానీ... జైజై భవానీ


- క్యూలైన్లు కిటకిట

- ఒక్కొక్కరికి గరిష్టంగా 20 లడ్డూలు విక్రయం


 సాక్షి, విజయవాడ :  శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న భవానీదీక్షల విరమణకు మూడోరోజు ఆదివారం పెద్దసంఖ్యలో భవానీలు వచ్చారు. దీక్షాధారులు, వారి కుటుంబసభ్యులతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు  కిటకిటలాడాయి. జై భవానీ...జై జై భవానీ అంటూ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది.

 

శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు సుమారు 75వేల మంది భక్తులు అమ్మను దర్శించుకున్నారని, రాత్రి ఆలయం మూసే సమయానికి ఆ సంఖ్య లక్షదాటుతుందని ఈవో సీహెచ్ నర్సింగరావు ‘సాక్షి’కి తెలిపారు.  దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలను దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు. భవానీలు దేవస్థానం దిగువన ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో బియ్యం, పూజా సామగ్రిని అప్పగించి, నేతితో నింపిన కొబ్బరికాయలను హోమగుండాల్లో వేశారు. కొందరు భవానీలు అమ్మవారి వేషధారణతో రావడం విశేషం.

 భక్తులు తాము తయారు చేసిన పొగళ్లును దుర్గమ్మకు సమర్పించి ప్రసాదంగా తీసుకుంటున్నారు. మూడోరోజు సుమారు 9 వేల మంది అమ్మవారి భోజనప్రసాదాన్ని స్వీకరించారు.. రూ.1,05,650 అన్నదానికి విరాళంగా లభించింది.

 

ఒక్కొక్కరికి 20 లడ్డూలు మాత్రమే.....

భక్తులకు కావాల్సిన లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఒక్కో భక్తుడికి 20 లడ్డూలు మించి విక్రయించకూడదని ఈవో నిర్ణయించారు. వాస్తవంగా క్యూలైన్లలో ప్రతి భక్తుడు నిలబడి ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది భక్తులు ఐదు నుంచి 10 లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు. అయితే చివర రెండు రోజులు కొరత వస్తుందని భావిస్తున్న కొంతమంది వందల సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేసి బ్లాక్ చేయాలని భావిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.

 దీంతో ఒక్కోభక్తుడికి భక్తుడికి అత్యధికంగా 20 లడ్డూలు మించి విక్రయించకూడదని నిర్ణయించారు. ఆదివారం సుమారు 3 లక్షల లడ్డూలు విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు.

 

పులిహోర పంపిణీకి బాడిగ రూ.25వేల విరాళం

అమ్మవారని దర్శించుకున్న భవానీలకు ఉచితంగా పులిహోర ప్రసాదం పంపిణీ చేసేందుకు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ తన వంతు సహాయం అందించారు. నాలుగోరోజు 300 కేజీల పులిహోరను పంపిణీ చేసేందుకు రూ.25 వేలు ఆయన దేవస్థానానికి చెల్లించారు.

 

రూ. 28.64 లక్షల ఆదాయం

మూడోరోజు ఆదివారం అమ్మవారికి రూ 28,64,145 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. 2.50 లక్షల లడ్డూలు విక్రయం ద్వారా రూ.25లక్షలు, 18,200 పులిహోర ప్యాకెట్లు విక్రయం ద్వారా రూ.91 వేలు,  110 శ్రీ చక్ర లడ్డూల ద్వారా రూ.5,500,  కేశఖండన ద్వారా రూ.2.62 లక్షలు, చెవి కట్టుడు టిక్కెట్లు విక్రయం ద్వారా రూ.250 ఆదాయం దేవస్థానానికి లభించింది. శనివారం దేవస్థానానికి రూ.21.91 లక్షలు ఆదాయం రాగా గత ఏడాది రెండో రోజు మంగళవారం 22.97 లక్షలు ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికార వర్గాలు వెల్లడించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top