అక్టోబర్‌ 1 నుంచి బెల్ట్‌ షాపులు బంద్‌ 

Belt shops bandh from October 1 - Sakshi

రాష్ట్రంలో ఆ పేరే వినిపించదు: సీఎం వైఎస్‌ జగన్‌

రహదారులపై మద్యం దుకాణాలు ఉండవు 

విద్యాసంస్థలు, ఆలయాల వద్ద ఉండకూడదన్న నిబంధన కచ్చితంగా అమలు 

దశలవారీగా మద్య నిషేధానికి వేగంగా చర్యలు 

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహణ   

ప్రస్తుతం ఉన్న దుకాణాల లైసెన్స్‌ గడువు మాత్రం మరో 3 నెలలు పొడిగింపు   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు 1వతేదీ నుంచి ఎక్కడా బెల్టు షాపులు ఉండవని, అసలు ఆ పేరే వినిపించదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండబోవని చెప్పారు. బెల్ట్‌ షాపులు లేకుండా చేయడంతోపాటు మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంతో ప్రభుత్వమే రిటైల్‌గా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. శాంతిభద్రతలపై మంగళవారం జరిగిన కలెక్టర్లు – ఎస్పీల ఉమ్మడి సమావేశంలో సీఎం ఈమేరకు ప్రకటించారు. ‘ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్‌ షాపులకు తెర పడదు. ప్రభుత్వం నిఘా పెంచినా ఒక వారం రోజులు మూసివేసి మళ్లీ ఏదో ఒకవిధంగా బెల్ట్‌ షాపులు తెరుస్తారు. లాభార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాలు పెంచుకోవడానికే ప్రయత్నిస్తారు. అదే ప్రభుత్వమైతే బెల్ట్‌ షాపులు నిర్వహించదు. మద్యం విక్రయాలు పెంచాలనే స్వార్థం ఉండదు. ఈ లక్ష్యంతోనే అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆం్రధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారానే మద్యం షాపులు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం’ అని సీఎం జగన్‌ వివరించారు. 

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం దుకాణాలు
రాష్ట్రంలో అక్టోబరు 1వతేదీ నుంచి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రిటైల్‌ మద్యం షాపులు నిర్వహిస్తామని రెవెన్యూ (ఎక్సైజ్‌) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తెలిపారు. దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏటా మద్యం షాపులు తగ్గిస్తామన్నారు. ‘రాష్ట్రంలోని 4,377 మద్యం షాపుల లైసెన్సు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ దుకాణాదారులు మరో మూడు నెలల పాటు షాపులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తాం. తర్వాత ప్రైవేట్‌ దుకాణాలుండవు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ రిటైల్‌ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తుంది. క్రమేణా వీటిని తగ్గిస్తూ సంపూర్ణ మద్య నిషేధం అమలు దిశగా చర్యలు తీసుకుంటాం’ అని సాంబశివరావు వివరించారు.

సెప్టెంబర్‌ 30 వరకు లైసెన్స్‌ గడువు పొడిగింపు
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సు గడువును మరో మూడు నెలల పాటు పెంచుతూ రెవెన్యూ (ఎక్సైజ్, వాణిజ్య, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని 4,377 మద్యం దుకాణాలు, 15 హైబ్రీడ్‌ హైపర్‌ మార్కెట్ల లైసెన్సు వ్యవధి ఈనెల 30వ తేదీతో ముగియనుండటం తెలిసిందే. వీటి గడువును సెప్టెంబర్‌ 30వతేదీ వరకు పెంచుతున్నట్లు మెమోలో ప్రభుత్వం పేర్కొంది. మూడు నెలల కాలానికి లైసెన్స్‌ ఫీజుతోపాటు పర్మిట్‌ రూమ్స్‌ లైసెన్సు ఫీజులను వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలను మాత్రం తిరిగి చెల్లించేది లేదని మెమోలో స్పష్టం చేశారు.  

సమాజ శ్రేయస్సు కోసమే: సీఎం 
‘అన్నీ ఆలోచించి సమాజ శ్రేయస్సు కోసమే దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించాం. బెల్ట్‌ షాపులు లేకుండా చేయాలి. రహదారులు వెంట, దాబాల్లో కూడా మద్యం అమ్ముతున్నారు. అక్టోబరు 1 నుంచి ఇలా జరగనివ్వం. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఆలయాలు, విద్యా సంస్థల సమీపంలో మద్యం షాపులు ఉండరాదనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top