నిరాదరణ   | BC Corporations Loans Not Released | Sakshi
Sakshi News home page

నిరాదరణ  

Apr 21 2019 8:10 AM | Updated on Apr 21 2019 8:10 AM

BC Corporations Loans Not Released - Sakshi

కర్నూలు(అర్బన్‌): బీసీ కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత తదితర కారణాల వల్ల ఆదరణ పథకం జిల్లాలో అభాసుపాలైంది. బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారికి 90 శాతం సబ్సిడీపై ఆధునిక పనిముట్లు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది చేతి వృత్తిదారులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోనే దరఖాస్తు చేసుకున్నా.. వారు కోరుకున్న పనిముట్లను సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.

దరఖాస్తుదారులు 70 వేలకు పైనే ...  
చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వడ్డెర, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ, మేదర, మత్స్యకారులు, టైలర్లు, యాదవ, కురువ తదితర కులాలకు చెందిన 70 వేల మందికి పైగా ఆదరణ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడతల వారీగా వివిధ రకాల పనిముట్లను నెలకు కొన్ని ప్రకారం జిల్లా కేంద్రాలకు పంపింది. మొట్టమొదట కుట్టు, ఎంబ్రాయిడరీ మిషన్లను ఎక్కువగా సరఫరా చేసింది. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ పనిముట్లను నియోజకవర్గ కేంద్రాల్లోని గోడౌన్లకు చేర్చే 


విషయంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. ఇదే తరుణంలో జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో భారీగా ఖర్చు చేసి మేళాలు నిర్వహించారు. వీటిలో పంపిణీ చేస్తామని లబ్ధిదారులను రప్పించుకుని కొందరికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారికి నియోజకవర్గ కేంద్రాల్లో అందజేస్తామని చెప్పి పంపారు.

వచ్చింది 37,676 పనిముట్లు మాత్రమే ...  
70 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. పది శాతం లబ్ధిదారుని వాటా చెల్లించిన  59,934 మందికి వివిధ రకాల పనిముట్లను అందించాలని జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయికి ఇండెంట్‌ పంపించారు. అయితే, ఉన్నతాధికారులు 37,676 పనిముట్లను మాత్రమే పంపించారు. ఇంకా 22,258 మందికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా అయిన వాటిలోనూ అధిక శాతం కుట్టుమిషన్లు, పాల క్యాన్లు, సైకిళ్లు, కార్పెంటరీ పనిముట్లు, చేపల వలలు,  సన్నాయి వాయిద్యాలు, సెలూన్‌ షాపులకు కుర్చీలు ఉన్నాయి. వచ్చిన వాటిలో ఇప్పటివరకు 29,905 పనిముట్లను మాత్రమే లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 7,701 గోడౌన్లలోనే మగ్గుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా..అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం అందజేసేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డొస్తోంది. కోడ్‌ ముగిసిన అనంతరమైనా  పంపిణీ చేస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

గోడౌన్లలో ఉన్న మాట వాస్తవమే 
ఆదరణ లబ్ధిదారులకు అందించాల్సిన పనిముట్లు గోడౌన్లలో ఉన్న మాట వాస్తవమే. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా అందించలేక పోతున్నాం. పాల క్యాన్లు, సైకిళ్లు, కుట్టుమిషన్లు వంటి ఏడు వేలకు పైగా పనిముట్లు గోడౌన్లలోనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తాం. ఈ నేపథ్యంలోనే పనిముట్ల వివరాలను పరిశీలించేందుకు బీసీ కార్పొరేషన్‌ అదనపు డైరెక్టర్‌ మల్లికార్జున జిల్లాకు వస్తున్నారు. ఆయా గోడౌన్లలోని రికార్డులను ఆయన పరిశీలించనున్నారు. – ఐడీ శిరీష, బీసీ కార్పొరేషన్‌ ఈడీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement