కొక్కొరొకోఢీ | bantam racing in Amalapuram | Sakshi
Sakshi News home page

కొక్కొరొకోఢీ

Jan 9 2014 2:06 AM | Updated on Sep 17 2018 6:26 PM

వేప్పువ్వు పచ్చడి లేని ఉగాదినీ, బాణసంచా లేని దీపావళినీ ఎవరూ ఊహించలేరు. అలాగే కొందరు కోడి పందేలు లేని సంక్రాంతిని ఊహించలేరు.

అమలాపురం, న్యూస్‌లైన్ :వేప్పువ్వు పచ్చడి లేని ఉగాదినీ, బాణసంచా లేని దీపావళినీ ఎవరూ ఊహించలేరు. అలాగే కొందరు కోడి పందేలు లేని సంక్రాంతిని ఊహించలేరు. అలాంటి వారు పందెపు బరి లేకపోతే తెలుగువారి ‘పెద్ద పండగ’ ‘చిన్న’బోయినట్టు భావిస్తారు. కంఠంపై ఈకలు రిక్కించి, కళ్లలో పౌరుషాగ్నిని దట్టించి, నేలే సంధించి విడిచిన అస్త్రాల్లా, గాలి గోదాలో రణవిన్యాసాలు చేసే పుంజులను చూడకపోతే పండగలో రంజు ఉండదని బలంగా నమ్ముతారు. వారి నమ్మకం ఎంత బలీయమైనదంటే.. చట్టసభల్లో సభ్యులైన ఎంపీలూ, ఎమ్మెల్యేలే.. చట్టవిరుద్ధమైన కోడిపందేలను ప్రారంభిస్తున్నట్టు మీడియాకు ఫోజులు ఇవ్వక తప్పనంత బలీయమైనది.
 
 ఓట్లు ఎక్కడ దూరమవుతాయన్న ఆదుర్దాతోనో, ఒత్తిళ్లతోనో ప్రజాప్రతినిధులే.. పండగ నాలుగురోజులూ పందేలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించమని, చూసీచూడనట్టు ఉండమని పోలీసు అధికారులకు పురమాయిస్తారన్నది లోకం ‘కోడై కూసే’ బహిరంగ రహస్యం. ఈ రివాజుపై గురితోనే, అందునా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలాంటి బెడదా లేకుండా నేతలే చూసుకుంటారన్న భరోసాతోనే పందెంరాయుళ్లు పోలీసుల ఆంక్షలున్నా బేఖాతరు చేస్తూ ‘పోరుబరులు’ సిద్ధం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి లక్షలు దండుకునేందుకు నిర్వాహకులు, తమ పౌరుషప్రతాపాలకు ప్రతినిధులుగా పుంజులు రెక్కవిప్పి రణవిన్యాసాలు చేస్తుంటే చూసి, ఉత్తేజితులయ్యే క్షణాల కోసం పందేల ప్రియులు తహతహలాడుతున్నారు. మరోవైపు ఖాకీ పెద్దలు షరామామూలుగానే ‘కోడి పందేలపై ఉక్కుపాదం మోపుతాం’ అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
 
 కోనసీమ కాదు.. కోళ్ల కదనసీమ
 జిల్లాలో ఈ ఏడాది అదనంగా మరికొన్ని చోట్ల పందేలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కోనసీమలో ఈ ఏడాది పెద్ద ఎత్తున పందేలు నిర్వహించనున్నారు. అల్లవరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, సఖినేటిపల్లి మండలాల్లో భారీ బరులు ఏర్పాటు కానున్నాయి. ఈ మండలాల్లో గోడి, ఎదుర్లంక, ఆత్రేయపురం, ఎన్.కొత్తపల్లిలలో   ఏటా పందేలు ముమ్మరంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఇక్కడ పందేల నిర్వహణకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అభయహస్తం ఇచ్చినట్టు తెలుస్తోంది.

 ఇక మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో వేట్లపాలెం, కిర్లంపూడి, గోకవరం మండలాల్లోనూ భారీ ఎత్తున పందేలు జరగనున్నాయి. ఇప్పటికే పలుప్రాంతాల్లో పందేలు మొదలయ్యాయి కూడా. జగ్గంపేట మండలం జే.కొత్తూరు సమీపంలోని జఠాద్రికొండ వద్ద సోమవారం పందేలు జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఇటీవల కాట్రేనికోన మండలంలో పందేలపై పోలీసులు దాడి చేసి లక్షల రూపాయల సొమ్మును, పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పేకాట, గుండాటలను సైతం నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పండగ మూడు రోజుల్లో ఏజెన్సీలో  రూ.50 లక్షల వరకు, మెట్టలో రూ.మూడు కోట్ల వరకు పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా.  ఇక కోనసీమలో అయితే ఒక్కో మండలంలోనే  రూ.ఐదు కోట్ల వరకు పందేలు జరుగుతాయంటున్నారు.
 
 మేలుజాతి పుంజు రూ.50 వేలు..
 పందెం రాయుళ్లు వేలాది రూపాయలు వెచ్చించి జాతి కోళ్లను పెంచుతూ, వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బాదం, జీడి పప్పు, పిస్తా వంటి ఆహరం పెడుతున్నారు. పుంజులు పోరాడేటప్పుడు ఆయాసం రాకుండా నిత్యం వాటితో ఈత కొట్టిస్తుంటారు. కాకి, డేగ, నెమలి, కొక్కిరాయి, పూల, పర్లా, రసంగి, సీతువ, తెల్లపర్లా వంటి పుంజులు జాతిని బట్టి రూ.మూడు వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతున్నాయి. మేలు జాతి పుంజుల్లో కొన్ని రూ.50 వేలకు కూడా అమ్ముడవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement