
బాలసాయిబాబా పార్థివదేహం
సాక్షి, హైదరాబాద్/కర్నూలు టౌన్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా (59) గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆశ్రమంలో ఉన్న ఆయనకు సోమవారం అర్ధరాత్రి ఛాతీ నొప్పి రావడంతో శిష్యులు ఆయన్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలసాయి పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం ఆస్పత్రి నుంచి తొలుత దోమలగూడ ఆశ్రమానికి, అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో కర్నూలులోని బాబా ఆశ్రమం శ్రీనిలయానికి తరలించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు శ్రీనిలయంలో బాలసాయి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భక్తులు తెలిపారు.
18 ఏళ్లకే బాలసాయిబాబాగా అవతారం...
కర్నూలులో రామనాథ శాస్త్రి, జయలక్ష్మమ్మ దంపతులకు 1960 జనవరి 14న బాలసాయి జన్మించారు. ఆయన అసలు పేరు బాలరాజు. పదవ తరగతి వరకు చదువుకున్న బాలసాయిబాబాకు కళలంటే ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఆ తరువాత బాలసాయిబాబాగా అవతారం ఎత్తారు. 18 ఏళ్ల వయసులోనే కర్నూలులో ఆశ్రమం ఏర్పాటు చేసి.. దైవ ప్రవచనాలు చేయడం ప్రారంభించారు. అనతికాలంలోనే ఆయన ప్రవచనాలు వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, శిష్యులు పెరిగిపోవడంతో కర్నూలు, హైదరాబాద్‌లలో ఆశ్రమాలు నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఏటా మహాశివరాత్రి పర్వదినాన తన నోట్లోంచి శివలింగాన్ని బయటకు తీసేవారు. అయితే ఇదంతా కనికట్టు అని జనవిజ్ఞాన వేదిక, హేతువాదులు విమర్శించేవారు. కానీ ఆ వాదనను బాలసాయి భక్తులు కొట్టిపడేసేవారు. తాము దైవంలా భావించే బాలసాయిబాబాకు మహిమలు ఉన్నాయని నమ్మేవారు. జనవరి 14న తన జన్మదినం సందర్భంగా బాలసాయిబాబా కర్నూలులో నిరుపేదలకు సహాయ కార్యక్రమాలు చేసే వారు. కర్నూలులోని శ్రీనిలయంలో ప్రతి ఏడాది బాలసాయిబాబా జన్మదినోత్సవానికి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ దేశాల నుంచి భక్తులు హాజరయ్యేవారు. బాల సాయిబాబా మరణవార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీనిలయం చేరుకున్నారు. బాబాకు సోదరుడు రమేష్‌తో పాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.