‘తల’రాత మారకుండా! | Awareness of Helmet Wearing Prakasam District | Sakshi
Sakshi News home page

‘తల’రాత మారకుండా!

Jun 15 2019 1:13 PM | Updated on Jun 15 2019 1:15 PM

Awareness of Helmet Wearing Prakasam District - Sakshi

పవన్‌ దాదాపు ఇంటికొచ్చేశాడు.. టర్నింగ్‌ తిరిగితే ఎదురుగా పిల్లలు, భార్య కనిపిస్తారు. కానీ ఇంతలోనే షాక్‌.. వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఎగిరి అవతల పడ్డాడు. తల సిమెంటు రోడ్డుకు గుద్దుకోవడంతో క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. అతని వద్ద హెల్మెట్‌ ఉన్నా ఆ.. ఇల్లు వస్తుందిలే కదా అని తీసి దానిని పెట్రోల్‌ ట్యాంక్‌పై పెట్టుకున్నాడు. అదే అతనికి మరణ శాసనం అయింది. అదే హెల్మెట్‌ ధరించి ఉంటే కచ్చితంగా ప్రాణాలు దక్కేవి. ఇది ఒక్క పవన్‌ విషాద గాథే కాదు.. ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో నిత్యం యాక్సిడెంట్‌ కేసుల్లో ఎంతో మంది బలి అవుతూనే ఉన్నారు. దీనికి ఒక చక్కని పరిష్కారం నాణ్యమైన హెల్మెట్లు ధరించడమే!

సాక్షి, రాచర్ల(ప్రకాశం) : ‘స్పీడ్‌ కిక్స్‌.. బట్‌ కిల్స్‌’ అనే వాక్యం హైవేల్లో దర్శనమిస్తూ ఉంటుంది. అంటే వేగంగా పోయినప్పుడు హుషారు అనిపించినా దాని వల్ల మరణం తప్పదనేది అర్థం. సాధారణంగా యూత్‌ అంటే వేగానికి సింబల్‌..మాటల్లో..దూకుడులో నిర్ణయాలు తీసుకోవడంలోనూ అంతే. శరీరంలో రక్తం జెట్‌ వేగంతో పరుగులు తీస్తుంటుంది. ఇలాంటి వారి చేతికి బైక్‌ ఎక్స్‌లేటర్‌ దొరికితే..దాని కేబుల్‌ తెగే దాకా తిప్పుతూనే ఉంటారు. హైవే రోడ్లపై బైక్‌ గంటకు 100 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. కానీ తేడా వస్తే క్షణకాలంలో జీవితం తిరగబడుతుంది. బైక్‌ రైడ్‌ చేసే వారికి హెల్మెట్‌ లేకపోతే ఫలితం ఘోరంగా ఉంటుంది. ఇలా విగతా జీవులుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డ్రైవింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయని వారు కూడా రోడ్డు ప్రమాదాల్లో బలైపోతున్నారు. ఇలాంటి ప్రమాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి తలను రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. వేలాది రూపాయలు పెట్టి బైక్‌ కొనేవారు వందల్లో ఖర్చయ్యే హెల్మెట్‌ గురించి ఆలోచించాలి. 

శిరస్సుకు మహారక్షణ
శరీరంలో ఇతర భాగాలకు గాయలైతే సాధ్యమైనంతవరకు చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ తలకు తీవ్రగాయలైతే మెదడు దెబ్బతిని మరణం సంభవిస్తుంది. కొన్నిసార్లు బ్రెయిన్‌ డెడ్‌ కావడం లేదా మతిస్థిమితం కోల్పోడం జరుగుతుంది. ముఖ్యంగా మోటారు సైకిల్‌ ప్రమాదాల్లో 90 శాతం మరణాలు తలకు తీవ్రమైన గాయలు కావడం వల్లే సంభవిస్తున్నాయని గుర్తించాల్సి ఉంది. అదే హెల్మెట్‌ వాడితే ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. నాణ్యమైన హెల్మెట్‌ వాడితే శిరస్సు సురక్షితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కారుల్లో ప్రయాణం చేసే వారు సీటు బెలును పెట్టుకోవాలి. సడన్‌ బ్రేకులు వేసినప్పుడు కారు దేనికైనా ఢీ కొట్టినప్పుడు, పల్టీలు కొట్టినా తలకు శరీర భాగాలకు తగిలే దెబ్బల నుంచి రక్షణ పొందవచ్చు. 

ఎలాంటి హెల్మెట్‌ వాడాలి..?

  • హెల్మెట్‌ వాడమన్నారు కాదా అని నాసిరకం హెల్మెట్‌ వాడితే ఇబ్బందులు తప్పవు. హెల్మెట్‌తో ప్రయోజనం లేకపోతే ప్రమాదంలో తలకు అసౌకర్యం కలుగుతుంది.
  • హెల్మెట్‌కు ఐఎస్‌ఐ మార్కు కలిగి ఉండాలి.
  • తల నుంచి మెడ భాగం వరకూ పూర్తి రక్షణ ఇచ్చేదిగా ఉండాలి.
  • మెడ కింద అమర్చిన ట్యాగ్‌ బెల్ట్‌ సౌకర్యంగా ఉండాలి.
  • గడ్డం కిందిబాగంలో నిర్దిష్టమైన గ్యాప్‌ ఉండాలి.
  • బైక్‌ నడుపుతున్నప్పుడు గాలి శబ్దం తీవ్రంగా రాకుండా సాధారణంగా ఉండాలి.
  • అన్ని శబ్దాలు బాగా వినిపించేలా ఉండాలి.

నిబంధనలు గాలికి
వాహనాలు నడిపే సమయంలో తలకు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు ఉన్నా.. చాలా మంది హెల్మెట్‌ ధరించడం లేదు. హెల్మెట్‌ ధరించాలని పలు కార్యక్రమాలు టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నా యువతలో ఇంకా చైతన్యం రావడం లేదు. ఈ మధ్యకాలంలో పోలీసులు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో జరిమానాలు విధిస్తున్నప్పుటికీ యువతలో ఇప్పటికి కూడా మార్పు రావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ప్రదేశంలో పోలీసులు వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని సూచనలు, సలహాలు ఇస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement