మరదలితో తిరగొద్దన్నందుకు మచ్చు కత్తితో దాడి

Attacked With A Sharp Knife In Yerraguntla - Sakshi

ఎర్రగుంట్ల మండలం కలమల్లలో ఘటన

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

సాక్షి, ఎర్రగుంట్ల : తన మరదలితో తిరగొద్దన్నందుకు ఓబులేసు అనే వ్యక్తిపై గురుస్వామి అనే వ్యక్తి మచ్చు కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం కలమల్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కర్చుకుంటపల్లి గ్రామానికి చెందిన ఎస్‌.ఓబులేసు ఆర్టీపీపీలోని ఆరవ యూనిట్‌లో కూలీలను పెట్టుకొని సబ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ కూలీలతో పాటు తన మరదలు శేషమ్మ కూడా ఆర్టీపీపీకి పనికి వస్తుండేది. అయితే ప్రొద్దుటూరు పట్టణం హనుమాన్‌నగర్‌కు చెందిన డి. గురుస్వామి కూడా ఆర్టీపీపీలో బేల్దార్‌ పని చేసేవాడు.  

ఈ నేపథ్యంలో శేషమ్మ, గురుస్వామికి పరిచయం ఏర్పడింది. వారిద్దరు చనువుగా ఉండేవారు. ఇది గమనించిన ఓబు లేసు వారిద్దరిని మందలించాడు. తమ పరిచయానికి ఓబులేసు అడ్డుగా ఉన్నాడని భావించిన వీరిద్దరూ అతనిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో రోజు మాదిరిగానే ఓబులేసు చిలంకూరు గ్రామం నుంచి ఆర్టీపీపీకి ఆటోలో కూలీలను పిలుచుకొని తాను బైకుపై బయలు దేరాడు. ఆ సమయంలోనే కలమల్ల వంకపై ఉన్న వంతెన వద్ద గురుస్వామి కాపుకాశాడు. ఓబులేసు బైకుపై వస్తుండగా ఎదురుగా గురుస్వామి కూడా బైకుపై వెళ్లి ఢీకొట్టాడు. కింద పడ్డ ఓబులేసుపై తాను వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో తలపై, భుజంపై నరికాడు. వెంటనే స్థానికులు కేకలు వేయడంతో పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు  మడుగులో పడి ఉన్న ఓబులేసును చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింంచారు. దాడి చేసిన గురుస్వామిని కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పరామర్శ: కలమల్లలో జరిగిన సంఘటనను తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఎం. సుధీర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి గాయపడ్డ ఓబులేసును పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top