మా వాడికి వైఎస్సార్‌సీపీతో సంబంధం లేనేలేదు

Attack on Jagan: SIT questions parents, friends of accused - Sakshi

స్పష్టం చేసిన శ్రీనివాసరావు తల్లిదండ్రులు

ఏం సాధించాలని చేశావ్‌?..

ఎవరు చేయమన్నారు?

నిందితుణ్ని నిలదీసిన తల్లిదండ్రులు

సాక్షి, విశాఖపట్నం: తమ కుమారుడికి వైఎస్సార్‌సీపీతో అసలు సంబంధాలు లేనేలేవని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మాకు కూడా ఆపార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలిపారు. విచారణ కోసం ముమ్మిడివరం మండలం ఠానేలంక నుంచి బుధవారం రాత్రి పోలీసులు శ్రీనివాసరావు తల్లిదండ్రులు  సావిత్రమ్మ, తాతారావులను విశాఖకు తీసుకొచ్చారు.

తొలుత గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో విచారించిన సిట్‌ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గురువారం రోజంతా అక్కడ వివిధ కోణాల్లో విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గ్రామంలో రాజకీయంగా ఏ పార్టీ వారితో తిరిగేవాడు, చురుగ్గా పాల్గొనే వాడా? వంటి విషయాలపై వారిని సిట్‌ ఆరా తీయగా... వాడు ఎప్పుడూ ఊళ్లో సరిగా ఉండనేలేదు.. వైఎస్సార్‌సీపీలో లేనే లేడు.

ఆ పార్టీ నేతలతో పరిచయం కూడా లేదని వారు చెప్పారు. తొలుత వారిని వేర్వేరుగా విచారించిన సిట్‌ అధికారులు ఆ తర్వాత ఇద్దర్ని ఒకే రూమ్‌లో పెట్టి శ్రీనివాసరావు ప్రవర్తన, నడవడిక, గుణగణాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత శ్రీనివాసరావును వారి ఎదురుగా పెట్టి అడిగారు. నిందితుని ప్రవర్తన, ఆలోచనా విధానాలే కాకుండా, ఎవరెవరితో ఎక్కువగా ఉండేవాడని అడిగారు.

ఎంతపని చేశావ్‌...
ఏరా ఎందుకింత పనిచేశావ్‌.. ఏం సాధించాలని చేశావ్‌.. ఎవరి కోసం చేశావ్‌? తలదించుకునేలా చేశావ్‌.. ఊళ్లో తల ఎత్తుకోలేకపోతున్నాం..నీ వల్ల అందరి పరువు పోయిందిరా.. అంటూ తాతారావు, సావిత్రమ్మలు కుమారుడిని నిలదీశారు. రాజకీయంగా ఎంతో పేరున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితునిగా నిలబడిన తన కొడుకును చూసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టిందిరా? ఎవరుచెయ్యమన్నారు ? అసలెందుకు చేశావ్‌? అంటూ కొట్టినంత పనిచేశారు.

మందలించినా కనిపించని పశ్చాత్తాపం
మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొడుకు ఉన్న గదిలోకి ఇద్దర్ని తీసుకెళ్లగానే వారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. గదిలో ఓ మూలన చేతికి బేడీలు వేసు కుని కూర్చొన్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నా అతనిలో కనీస పశ్చాత్తాపం కూడా కన్పించలేదు. మౌనంగా నిల్చుని ఏం సమాధానం చెప్పలేదు.

కొనసాగిన విచారణ
నిందితుడు శ్రీనివాసరావుపై విచారణ ఐదో రోజు గురువారం నిందితుని కాల్‌ డేటా చుట్టూనే తిరిగింది. కాల్‌ డేటా ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తీసుకొచ్చిన సయ్యద్‌ బీ షేక్, అమ్మాజీ షేక్, నాగర్‌ వల్లీ, రసూల్‌ను మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకుని గురువారం తెల్లవారు జామున పంపించేశారు. ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరితో పాటు ఆ రెస్టారెంట్‌లో పనిచేసిన ముగ్గురు యువతులను విచారించారు.

పాదయాత్ర సందర్భంగా విశాఖ ఎయిర్‌ పోర్టుమీదుగా వైఎస్‌ జగన్‌ రాకపోకలు సాగించడం మొదలు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాల పుటేజ్‌ను విశ్లేషిస్తున్నారు. మరో వైపు శ్రీనావాసరావు ఫోన్‌లో 321 మందితో గడిచిన నెల రోజులుగా ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా నిర్ధారణకు వచ్చారు. వారిలో వందమందికి పైగా పేర్లను నిందితుడు చెప్పడంతో వారి వివరాలు ఆరా తీస్తున్నారు.ఇప్పటి వరకు 40 మందిని విచారించగా, వారిలో 25 మంది మహిళలే కావడం గమనార్హం. నిందితుడికి  కేజీహెచ్‌  వైద్యలు పరీక్షలు నిర్వహించి  పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ప్రకటిం చారు. కస్టడీ ముగియనుండడంతో శుక్రవారం నిందితుడిని తిరిగి సెంట్రల్‌ జైలుకు తరలించాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top