అటాచ్‌మెంట్ అసమంజసం | Sakshi
Sakshi News home page

అటాచ్‌మెంట్ అసమంజసం

Published Wed, Oct 9 2013 1:30 AM

'attachment of assets is not proper'

పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ ముందు ‘జగతి’ న్యాయవాది వాదన
సాక్షి, న్యూఢిల్లీ:
జగతి పబ్లికేషన్స్‌కు చెందిన ఆస్తుల అటాచ్‌మెంట్ పూర్తిగా అసమంజసమని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) వ్యవహరించిందని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవి గుప్తా వాదించారు. జగతి పబ్లికేషన్స్‌కి చెందిన రూ. 34.65 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీలు) అటాచ్‌మెంట్ కేసుపై ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) మంగళవారం విచారణ జరిపింది.

అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ముందు రవి గుప్తా వాదనను వినిపించారు. పీఎంఎల్‌ఏ నిబంధనలు ఏ సందర్భంలో ఆస్తుల్ని అటాచ్ చేయాలో స్పష్టంగా చెబుతున్నాయని, ‘క్విడ్ ప్రో కో’ అనేదే జరగని ఈ కేసులో ఆ నిబంధనలను ఉపయోగించడం సరికాదన్నారు. ‘సంస్థలో పెట్టుబడులను అక్రమాల తాలూకు సొమ్ముగా చెబుతున్న ఈడీ అదెలాగో మాత్రం చూపడం లేదు. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు తగిన కారణాలు చూపాలి. వారు పెట్టిన కేసు లోపభూయిష్టమైనందున అటాచ్‌మెంట్ ఉత్తర్వును కొట్టివేయాలి’ అని విన్నవించారు.

పెట్టుబడులు పెట్టిన ముగ్గురు వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాన్నీ పొందలేదని కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. అలాంటప్పుడు వారి పెట్టుబడులను ‘క్విడ్ ప్రో కో’గా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. రవి గుప్తా వాదనల తర్వాత అథారిటీ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదావేసింది.

Advertisement
Advertisement