ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ | At movement election code | Sakshi
Sakshi News home page

ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్

Mar 2 2014 4:31 AM | Updated on Mar 19 2019 6:19 PM

ఈనెల 5వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ రావచ్చని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ తెలిపారు.

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 5వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ రావచ్చని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ తెలిపారు. లబ్ధిదారులకు వ్యక్తిగత పథకాలు అందించడంతో పాటు అంగన్‌వాడీ, పంచాయతీ, ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం రాత్రి ఒంగోలు డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
 
 ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
 అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి యుద్ధప్రాతిపదికన పంపిణీ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా భూసేకరణ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల శ్మశాన భూముల కోసం భూమి సేకరించాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద చెట్టు పట్టాలు మంజూరు చేయాలని చెప్పారు.
 
 అక్షర విజయంలో భాగస్వాములు కావాలి
 నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు నిర్వహిస్తున్న ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు భాగస్వాములు కావాలని కోరారు. 6లక్షల 15వేల మంది నిరక్షరాస్యులను గుర్తించామని, ఈనెల 9వ తేదీన జరగనున్న అర్హత పరీక్షకు వారిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
 
 5వ తేదీన మోడల్ పరీక్ష నిర్వహించాలని.. 10వ తేదీన అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని కోరారు. ఫలితాల తరువాత అభినందన సభలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, సీపీఓ మూర్తి, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ పోలప్ప, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, ఒంగోలు ఆర్‌డీఓ ఎంఎస్ మురళి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement