సిమ్‌పుల్‌గా మోసం | As simpul fraud | Sakshi
Sakshi News home page

సిమ్‌పుల్‌గా మోసం

Jun 8 2016 1:09 AM | Updated on Sep 4 2017 1:55 AM

తిరుపతిలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది.

కస్టమర్ ఫొటో, ఐడీ ప్రూఫ్‌లతో క్లోనింగ్
ఒకే పేరుతోనే అధికంగా నంబర్లు మంజూరు
అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న వైనం

 

తిరుపతిలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. ఓ ఉద్యోగానికి మిమ్మల్ని ఎంపిక చేశాం.. అధిక మొత్తంలో జీతం వస్తుంది.. కాకపోతే మీరు ముందుగా రూ.50 వేలు నగదు చెల్లించాలని నమ్మబలికారు. చెప్పిన అకౌంట్‌లో నగదును జమచేసి ఫోన్‌చేయగా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులను ఆశ్రయించగా ఆ నంబర్‌ను వేరే జిల్లాలో మరో వ్యక్తి వాడుతున్నట్టు తేలింది. వ్యాపారులు అదే పేరుపై సిమ్ కేటాయించారని గుర్తించారు.

 

తిరుపతి మంగళంలో నివాసముంటున్న యువతికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బాధితురాలు వీటిపై కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు  విచారించగా తీరా అది ఓ మహిళదేనని తేలింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పేరుతో సిమ్‌కార్డు పొందినట్టు పోలీసులు గుర్తించారు.


....ఇవన్నీ సిమ్ మాఫియాల కథ.. ఈ తరహా సమస్యలు తరచూ నగరంలో వెలుగులోకి వస్తున్నాయి. 25 నుంచి 30 శాతం మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే వారు వాడే సిమ్ కార్డు ఎక్కడైనా నేరం జరిగిన సమయంలో పోలీసులు ఆరా తీస్తే గుట్టు రట్టవుతోంది. అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. సిమ్‌వాడుతున్న అమాయకులు పోలీసులకు దొరికి బలైపోతున్నారు.

 

 

తిరుపతి క్రైం: పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన సిమ్‌మాయగాళ్లు ప్రస్తుతం తిరుపతి నగరంలో కూడా విజృంభిస్తున్నారు. ఎలాంటి ప్రూఫ్‌లు అవసరం లేకుండా సిమ్‌కార్డులు అమ్మే దందా జోరుగా సాగుతోంది. సిమ్ కొనుగోలుదారులు ఐడీ ప్రూఫ్‌ను పోర్జరీచేసి సిమ్‌కార్డును యాక్టివేట్ చేసి వ్యాపారులు, డీలర్లు అధిక ధరలకు విక్రయిన్నారు. వివిధ రకాల నెట్‌వర్క్ కంపెనీలకు తమ వ్యాపారులను విస్తృతపరుస్తున్నారు. ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

 
జోరుగా అమ్మకాలు

గతంలో కొందరు డీలర్ల వద్దే ఇలాంటి సిమ్‌కార్డులు లభ్యమయ్యేవి. ఇప్పుడు కంపెనీలు విచ్చలవిడిగా ఔట్‌లెట్లు ఏర్పాటుకు అనుమతులివ్వడంతో చిల్లర వ్యాపారులు, ఫ్యాన్సీ షాపులు, రీచార్జ్ కౌంటర్లు, రోడ్లపై టెంట్లల్లో సైతం సిమ్‌కార్డులు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా కంపెనీలు ఎక్కువ సిమ్‌కార్డులు విక్రయించినవారికి రాయితీలు, కానుకలు, ఇన్‌సెన్‌టివ్‌లు, కమీషన్లతో పాటు లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. వీటికి ఆశపడి ఏజెంట్లు, డీలర్లు అడ్డదార్లు తొక్కుతూ కస్టమర్లను ఇబ్బందిపెడుతున్నారు.

 
ఎలా జరుగుతోందంటే..

ఏ కంపెనీ సిమ్ కావాలన్నా ట్రాయ్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుడి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంది. ఇలా సిమ్ కొనుగోలుదారుడు సమర్పించిన జిరాక్స్‌లను పెద్దసంఖ్యలో కాపీచేస్తున్నారు. వాటి ద్వారా సిమ్‌కార్డులను బ్లాక్ చేస్తున్నారు. అనంతరం కాపీ ప్రూఫ్  ద్వారా ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండా ఎవరికిపడితే వారికి సిమ్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

 
చిక్కుల్లో అమాయకులు

వ్యాపారుల మితిమీరిన దురాశ వల్ల అమాయకులు చిక్కుల్లో పడుతున్నారు. సిమ్ జారీ అయ్యేది ఒకరిపేరుతో.. దాన్ని వాడేది మరొకరు. వారు సిమ్ కార్డును దుర్వినియోగం చేస్తే అందులో అడ్రస్‌లో ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలి. పలు కేసుల్లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటివాటిపై పోలీసుల నిఘా తగ్గడంతో సిమ్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement