ఆర్ట్స్‌లో ఫెయిల్‌ అయిన నన్నయ పీజీ క్యాంపస్‌ | ARTs Group Has Closed In Nannaya PG college In Tadepalligudem | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌లో ఫెయిల్‌ అయిన నన్నయ పీజీ క్యాంపస్‌

Jul 3 2019 9:46 AM | Updated on Jul 3 2019 9:46 AM

ARTs Group Has Closed In Nannaya PG college In Tadepalligudem - Sakshi

తాడేపల్లిగూడెంలోని నన్నయ పీజీ క్యాంపస్‌

పట్టణంలోని నన్నయ పీజీ క్యాంపస్‌లో ఒకటొకటిగా ఆర్ట్స్‌ కోర్సులు ఎత్తేస్తున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ పీజీ క్యాంపస్‌గా దీనికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలంలో ప్రారంభమైన ఈ క్యాంపస్‌ నన్నయ వర్సిటీ పరిధిలోకి వచ్చింది. ఏయూ పీజీ క్యాంపస్‌గా వైఎస్‌ హయాంలో ఇక్కడ ప్రారంభమయ్యాక ఆర్ట్స్‌ విభాగంలో ఎంబీఏ, ఎంఏ ఇంగ్లిషు, ఎంఈడీ, ఎంకాం కోర్సులు ఉండేవి. అయితే విద్యార్థులు చేరడంలేదనే ఒకే ఒక్క కారణాన్ని ఫైళ్లలో రాసుకొని ఒకటొకటిగా కోర్సులను ఎత్తేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆర్ట్స్‌లో మిగిలిన ఒకే ఒక ఏంబీఏ కోర్సును ఎత్తేస్తుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.        

సాక్షి, తాడేపల్లిగూడెం : క్యాంపస్‌ను దశలవారీ విస్తరించడానికి అప్పట్లో సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేక జీఓ ద్వారా క్యాంపస్‌కు వంద ఎకరాల స్థలం కేటాయించారు. క్యాంపస్‌ నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అయితే వైఎస్‌ అనంతరం మారిన ప్రభుత్వాల హయాంలో వైఎస్‌ కేటాయించిన భూమిని పూర్తిగా క్యాంపస్‌ వినియోగించలేకపోవడంతో, ఆ భూమిని తిరిగి రెవిన్యూ అ«ధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక అధికారులుగా వచ్చిన కొందరి వ్యక్తిగత ప్రవర్తనల కారణంగా క్యాంపస్‌ ప్రాధాన్యత మసకబారింది. చక్కని కోర్సులున్నా విద్యార్థులు చేరేవారు కాదు. కొత్త కోర్సులు తీసుకువస్తామని, ఉన్న కోర్సులలో మరింతమంది విద్యార్థులు చేరడానికి సౌకర్యాలు కల్పిస్తామని  అప్పటి నన్నయ వర్సిటీ ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు పలుమార్లు ఇక్కడ మీడియాకు చెప్పారు. ఆయన తర్వాత ప్రత్యేక అ«ధికారి పాలన, ఇన్‌చార్జి వీసీల నేతృత్వంలో ఇక్కడ ఆర్ట్స్‌ కోర్సులను ఎత్తేసే పరిస్థితి వచ్చినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

ఉన్న ఒక్క ఎంబీఏ కోర్సును.. 
ప్రస్తుతం ఇక్కడి పీజీ క్యాంపస్‌లో ఎంబీఏ కోర్సు ఒకటే ఆర్ట్స్‌ విభాగంలో ఉంది. 2018–20 బ్యాచ్‌గా విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ నిబంధనావళి ప్రకారం ఈ బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య ఉంది. కానీ ఈ కోర్సును ఎత్తేస్తున్నామని, ప్రస్తుత ఈ బ్యాచ్‌ విద్యార్థులు కాకినాడ కాని, రాజమండ్రి కాని వచ్చి చదువుకోవాలని వర్సిటీ బాధ్యులు మౌఖికంగా చెప్పి విద్యార్థులను ఇక్కడి నుంచి తరలించనున్నారు. తద్వారా ఈ కోర్సును ఎత్తేసిన జాబితాలో చేర్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఒక కోర్సును రద్దు చేసే పక్షంలో ఆరు నెలల ముందు ప్రకటన రూపంలో బహిరంగపర్చాలి. ఏదైనా కోర్సులో చదివే విద్యార్థుల సంఖ్య నలుగురి కంటే తక్కువ ఉంటే మాత్రమే కోర్సును రద్దు చేయాలి. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో ఉన్న ఎంబీఏలో అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈ బ్యాచ్‌లో విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. జిల్లాలో ఎంబీఏ కోర్సు కలిగిన ఏకైక ప్రభుత్వ క్యాంపస్‌ నన్నయ క్యాంపస్‌ మాత్రమే.

గూడెం పట్టణంలో ఉన్న ప్రయివేటు కళాశాలల్లో మూడింటిలో ఎంబీఏ కోర్సు ఉంది. ఇన్‌టేక్‌గా రెండు కళాశాలల్లో 120 సీట్లు ఉన్నాయి. అవి భర్తీ అవుతున్నాయి. మరో ప్రయివేటు కళాశాలలో కూడా ఎంబీఏకు విద్యార్థులు బాగానే చేరుతున్నారు. ఎంబీఏ చదివే విద్యార్థులకు ప్రయివేటు విద్యాసంస్థలతో పోల్చుకుంటే క్యాంపస్‌ ఫీజు చాలా తక్కువ. ప్రయివేటు కళాశాలల్లో ఎంబీఏ ఫీజు 60 వేల రూపాయల వరకు ఉంటే, క్యాంపస్‌లో ఎంబీఏ పీజు కేవలం 16,300 రూపాయలు మాత్రమే. పైగా ఇక్కడ విద్యార్థులను ఇండస్ట్రీయల్‌ టూర్స్‌కు తీసుకెళతారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో అధికారులు ఇక్కడ ఎంబీఏ కోర్సు రద్దు చేసే యోచనపై విద్యార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement