సంబరానికి సంసిద్ధం

Arrangements Over For Navratri Celebration In Indrakeeladri Temple - Sakshi

ఆదివారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

రూ.7 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు

అక్టోబరు 5న సీఎం జగన్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు  సమర్పణ

దసరా సంబరానికి ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 8వ తేదీ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సాక్షి, విజయవాడ: ఏటా ఆశ్వీయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 8 వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కనకదుర్గ అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు. దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అందువల్ల ఆ రోజు వీఐపీల దర్శనం రద్దు చేశారు. అన్ని క్యూలైన్లను సర్వదర్శనంగా పరిగణిస్తారు. రాష్ట్ర పండుగ కావడంతో  రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, అగ్నిమాపక, విపత్తుల నివారణ, దేవదాయ, మత్స్య, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. 

అక్టోబర్‌ 8న దుర్గమ్మ నదీవిహారం 
విజయదశమి రోజు అక్టోబర్‌ 8న అమ్మవారి తెప్పోత్సవం కృష్ణానదిలో కనుల  పండువగా జరుగుతుంది. హంస వాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లు వేద మంత్రాలు, అర్చకుల ప్రత్యేక పూజల మధ్య నదీ విహారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, విశేష చండీహోమం నిర్వహిస్తారు. అలాగే నిత్యం నగరోత్సవం నిర్వహిస్తారు. అర్జున వీధిలోని దేవస్థానం అన్నదాన సత్రంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచిత అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించవచ్చు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top