సైనికుడై వస్తాడనుకుంటే... | Army Recruitment dead are treated in care | Sakshi
Sakshi News home page

సైనికుడై వస్తాడనుకుంటే...

Jul 9 2015 1:26 AM | Updated on Sep 28 2018 3:41 PM

సైనికుడై వస్తాడనుకుంటే... - Sakshi

సైనికుడై వస్తాడనుకుంటే...

దేశసేవలో తరించాలనుకున్నాడు... భరతమాత ముద్దుబిడ్డగా ఎదగాలనుకున్నాడు... ఆర్మీజవానుగా మారి...

ఆర్మీ రిక్రూట్ మెంట్‌లో అపశ్రుతి  
పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన యువకుడు
అనంతరం అస్వస్థతతో అపస్మారకస్థితికి చేరుకున్న వైనం
కేర్‌లో చికిత్స పొందుతూ మృతి

 
దేశసేవలో తరించాలనుకున్నాడు... భరతమాత ముద్దుబిడ్డగా ఎదగాలనుకున్నాడు... ఆర్మీజవానుగా మారి... శత్రు సైన్యాన్ని తుదముట్టించాలనుకున్నాడు... చిన్ననాటి కలలను సాకారం చేసుకోవాలనుకున్నాడు... విధి ఆ యువకుడిని చిన్నచూపు చూసింది... పట్టుదలతో పరుగులో మొదటిస్థానంలో నిలిచినా.. బతుకు పరుగులో విగతుడయ్యాడు... పాపం! కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు.
 
వీరఘట్టం, అల్లిపురం, డాబాగార్డెన్స్: ఆర్మీ జవాన్‌గా దేశసేవ చేయాలన్నది ఆ యువకుడి ఆశ. అదే సంకల్పంతో ఇప్పటికి రెండు సార్లు యత్నించి  విఫలమయ్యాడు. మూడోసారి ఎంపికలకు కుటుంబ సభ్యులు వద్దనా పట్టుదలగా వెళ్లాడు. పరుగులో విజేతగా నిలిచాడు. విధివశాత్తూ అస్వస్థతకు లోనై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఇదీ తూడి గ్రామానికి చెందిన నీలబాబు(21) విషాద గాథ. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన పొన్నాడ నీలబాబు తన మిత్రులతో కలిసి వెళ్ళాడు. బుధవారం నిర్వహించిన పరుగు పందెంలో అందరికంటే వేగంగా దూసుకువచ్చి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు లోనై అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆర్మీ సిబ్బంది కేజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తూ కేర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలబాబు ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో ఈ పరిస్థితి వచ్చిందని కేర్ వైద్యులు ధ్రువీకరించారు.

 కన్నీరుమున్నీరైన కన్నవారు
 తమ ఏకైక కుమారుడు ఆర్మీ జవాన్‌గా వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తనయుడు విగతజీవుడయ్యాడనే వార్త తెలియగానే హతాసులయ్యారు. కన్నతల్లి గంగమ్మ, పెంచిన తల్లి గౌరీశ్వరి, తండ్రి పెద్ద గౌరినాయుడు ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. తరువాత తేరుకుని కొడుకును చూసేందుకు విశాఖపట్నం తరలి వెళ్ళారు. ఆస్పత్రి బయట వారి రోదనచూసిన వారు చలించిపోయారు. నీలబాబుకు డిగ్రీ చదువుతున్న చెల్లెలు సంధ్యారాణి ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement