‘థర్మల్‌’కు డిమాండ్‌

APGenco plays a key role in the power supply - Sakshi

అన్ని యూనిట్లు విద్యుదుత్పత్తిలోకి 

మూడు వారాలకు సరిపడా బొగ్గు నిల్వలు

వాతావరణ మార్పులతో పడిపోయిన పవన, సౌర విద్యుదుత్పత్తి 

క్లిష్ట సమయంలో జెన్‌కో కీలక పాత్ర

పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన విద్యుత్‌ శాఖ

సాక్షి, అమరావతి: ఏపీ జెన్‌కో ముందస్తు వ్యూహం ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తోంది. పవన, సౌర విద్యుదుత్పత్తి పడిపోయినప్పటికీ విద్యుత్‌ సరఫరాలో జెన్‌కో కీలకపాత్ర పోషిస్తోంది. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలతో అన్ని యూనిట్లనూ క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ అందించేందుకు జెన్‌కో సన్నద్ధమవుతోంది.  

ఏం జరుగుతోంది? 
► గత మూడు రోజులుగా వాతావరణం మారడంతో పవన, సౌర విద్యుదుత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఇవి రెండూ కలిపి 7 వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తుండగా మూడు రోజులుగా క్రమంగా తగ్గుతోంది. మంగళవారం 1,900 మెగావాట్లకే పరిమితమైంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల సౌరశక్తి, గాలి లేకపోవడం వల్ల పవన విద్యుదుత్పత్తి పడిపోయింది. 
► రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 9 వేల మెగావాట్ల నుంచి 7 వేలకు తగ్గింది. అయితే విండ్, సోలార్‌ పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాలో క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను ముందే ఊహించిన లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ఏపీ జెన్‌కోను అప్రమత్తం చేసింది. 
► కొంతకాలంగా నిలిపివేసిన కృష్ణపట్నం, వీటీపీఎస్, ఆర్టీపీపీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చారు. ప్రస్తుతం ఏపీ జెన్‌కో 4,500 మెగావాట్లకుగానూ 2 వేల మెగావాట్ల వరకు ఉత్పత్తిలోకి తెచ్చింది. ఇతర విద్యుత్‌ లభ్యత తగ్గితే తక్షణమే ఉత్పత్తి పెంచగల సమర్థత జెన్‌కోకు ఉందని అధికారులు తెలిపారు.  

బొగ్గు నిల్వలు పుష్కలం.. 
► ఏపీ జెన్‌కో వద్ద ప్రస్తుతం 15 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అన్ని థర్మల్‌ ప్లాంట్లకు కలిపి రోజుకు 70 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. దీన్నిబట్టి మూడు వారాలకు సరిపడా బొగ్గు అందుబాటులో ఉంది. రోజూ గనుల నుంచి బొగ్గు అందుతోంది.  
► లాక్‌డౌన్‌ కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడంతో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌ వాడకం పూర్తిగా ఆగిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్‌ లభించింది. ఈ సమయంలోనే జెన్‌కో అప్రమత్తమైంది. ఉత్పత్తిని నిలిపివేసి బొగ్గు నిల్వలు పెంచుకుంది. ప్లాంట్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టింది. ముందుచూపుతో వ్యవహరించడం ఇప్పుడు కలసి వస్తోంది.  
► మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుంది. క్రమంగా వ్యవసాయ విద్యుత్‌ వాడకం పెరిగే వీలుంది. అయినప్పటికీ ఎక్కడా చిన్న అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించేందుకు జెన్‌కో ముందస్తు వ్యూహాలు ఉపకరిస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. వర్షాకాలంలో బొగ్గు వెలికితీత, రవాణా కష్టమైనప్పటికీ నిరంతరాయంగా విద్యుదుత్పత్తికి జెన్‌కో సిద్ధమైందని పేర్కొంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top