గ్రామానికో కానిస్టేబుల్‌.. మండాలానికో ఎస్సై

AP Special CS D Sambasiva rao Meeting With Excise Officials Over Belt Shops - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అమలు పర్చడానికి ఎక్సైజ్‌ శాఖ రంగంలోకి దిగింది. వారం రోజుల్లో రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించాలని.. రేపటి నుంచే పని మొదలు పెట్టాలని స్పెషల్‌ సీఎస్‌ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్‌ కమిషనర్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దీన్ని పూర్తిగా అరికట్టాలంటే గంజాయి సాగులో లేకుండా చూడాల్సిన బాధ్యత అబ్కారీ శాఖపై ఉందన్నారు.

గ్రామానికో కానిస్టేబుల్ : ముకేశ్‌ కుమార్‌
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ సిబ్బంది అంతా గట్టిగా పనిచేస్తే బెల్టు షాపుల తొలగింపు అసాధ్యం కాదని కమిషనర్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా అన్నారు.  ప్రతి గ్రామంలోనూ మద్యం బెల్టు షాపుల ఎత్తివేతకు సమావేశాలు నిర్వహించాలని, నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ చేయాలని సూచించారు. బెల్టు షాపుల నియంత్రణ కోసం ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను.. మండలానికి ఎస్సైని బాధ్యులుగా నియమిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించి బెల్టు షాపులు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెల్టు షాపుల నిర్మూలనపై ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బెల్టు షాపుల నియంత్రణలో నూరుశాతం ఫలితాలు సాధించిన సిబ్బందికి రివార్డులు అందజేసి సత్కరిస్తామని చెప్పారు. (చదవండి : ‘బెల్ట్‌’ తీయకుంటే లైసెన్స్‌ రద్దు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top