ఏమరుపాటుతో పోలీసుల చేతిలో పేలుతున్న గన్‌లు

Basireddy Chandrasekhar Reddy - Sakshi

సాక్షి, అమరావతి: బతుకుదెరువు కోసం ఎంచుకున్న పోలీస్‌ ఉద్యోగంలో ఏమరుపాటు వారి ప్రాణాలనే తీస్తోంది. రక్షించాల్సిన తుపాకీ వారి ప్రాణాలనే బలితీసుకుంటోంది. మంత్రులు, అధికారుల అంగరక్షకులు (గన్‌మెన్‌లు) ఇటీవల మిస్‌ఫైర్‌ అయ్యి మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మెన్‌ చంద్రశేఖర్‌రెడ్డి కడపలో గురువారం రివాల్వర్‌ శుభ్రం చేసుకుంటూ మిస్‌ఫైర్‌ అయ్యి దుర్మరణం చెందడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ ఏపీ భవన్‌ నుంచి ఏపీ, తెలంగాణల్లోను ఈ తరహా ఘటనలు పెరగడం పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఏడాది జనవరి 2న కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తుకు వచ్చిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ హంపన్న చేతిలో ఏకే47 గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. తీవ్రగాయాలైన హంపన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర వైద్యసేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు.

గతేడాది జూలైలో ఇంటిగ్రేటెడ్‌ ట్రైనింగ్‌ అకాడమిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొన్న కార్యక్రమంలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్‌ వాసుదేవరెడ్డి చేతిలో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 2015 అక్టోబర్‌లో 404 గదిలో జరిగిన కాల్పుల్లో పోలీస్‌ అధికారి ఒకరు గాయపడగా అది మిస్‌ఫైర్‌గా విచారణలో నిర్ధారించారు. గతేడాది జూన్‌లో పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్‌ అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్‌ అయ్యి చనిపోయాడని తొలుత భావించినప్పటికీ ఆయన కణతికి దగ్గర్లో కాల్చుకున్నట్టు ఉండటంతో ఆత్మహత్య అయి ఉండొచ్చని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు భావించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నెల్లూరు ఏఎస్‌పీ శరత్‌బాబు కారుడ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్‌ రమేష్‌బాబు రివాల్వర్‌ కాల్పులతో అనుమానాస్పదంగా దుర్మరణం పాలయ్యాడు.  

ఇలా ఎందుకు జరుగుతోంది..
పోలీసులకు శిక్షణ సమయంలో ఆయుధాలు వినియోగించడంతో పాటు వాటిని భద్రంగా చూసుకోవడంలో కూడా తర్ఫీదు ఇస్తారు. ఏడాదికి ఒకసారి జిల్లా కేంద్రం నుంచి ఒక హెడ్‌కానిస్టేబుల్‌ (ఆర్మర్‌) ప్రతీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆయుధాల పనితీరు పరిశీలించి, మరమ్మతులు చేస్తారు. గన్‌లు, తుపాకులు వెంట తీసుకెళ్లినప్పుడు లోడ్‌ చేసినప్పటికీ బ్యాక్‌ లాక్‌ వేస్తారు. ఫైర్‌ ఓపెన్‌ చేయాల్సి వస్తే లాక్‌ తీసి ఆయుధాలను వినియోగిస్తారు. ఇలాంటి సమయంలో మిస్‌ఫైర్‌ కావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని ఒక పోలీస్‌ అధికారి చెప్పారు. ఇటువంటి ఘటనల్లో ఎక్కువగా ఉద్దేశపూర్వకంగా  కాల్పుకోవడం, ఎవరైనా కాల్చడం జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కారణం ఏదైనా మిస్‌ఫైర్‌కు పోలీసుల బతుకు బలైపోతుంటే వారి కుటుంబాలు మాత్రం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మిస్‌ఫైర్‌ వ్యవహారంపై పోలీస్‌ బాస్‌ దృష్టిపెడితే తమ ఆయుధాలకే బలైపోతున్న పోలీసుల ప్రాణాలు కాపాడినట్టు అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top