కరకట్ట భవన యజమానులకు మరోసారి హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

కరకట్ట భవన యజమానులకు మరోసారి హైకోర్టు నోటీసులు

Published Sat, Nov 2 2019 5:17 AM

AP High Court notices again for Karakatta building owners - Sakshi

సాక్షి, అమరావతి: కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం ఆ నిర్మాణాల యజమానులను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

కష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో లింగమనేని రమేశ్, ఇతర నిర్మాణాల యజమానులు, పలువురు అధికారులతో సహా 49 మంది ప్రతివాదులుగా ఉన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులు అందని వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 

Advertisement
Advertisement