ముందు మండలి నిర్ణయం రానివ్వండి

AP High Court Comments On Three Capitals and High Court Moving lawsuits - Sakshi

బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఆ తరువాత విచారణ జరుపుతామన్న హైకోర్టు ధర్మాసనం 

ప్రస్తుతం జోక్యం చేసుకోవాల్సిన కారణాలేవీ కనిపించడం లేదని వ్యాఖ్య

విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై శాసనమండలి నిర్ణయం తీసుకున్న తరువాత రాజధాని, హైకోర్టు తరలింపు వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అశోక్‌ భాన్‌ వాదనలు వినిపిస్తూ ద్రవ్య బిల్లు రూపంలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం తెచ్చిందన్నారు.

అయితే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సమాధానమిస్తూ అవి ద్రవ్య బిల్లులు కావని తెలిపారు. సాధారణ బిల్లులుగానే వాటిని ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిందని, వాటిపై చర్చ జరుగుతోందని నివేదించారు. దీనిపై అశోక్‌ భాన్‌ జోక్యం చేసుకుంటూ ద్రవ్యబిల్లులు కాదంటూ ఏజీ చేసిన ప్రకటనను నమోదు చేయాలని కోరగా అవసరమైనప్పుడు నమోదు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. బిల్లులు ఇంకా చట్ట రూపం దాల్చలేదని, ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏదీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. 

మీకెందుకు అంత తొందర?
ముఖ్యమంత్రి బుల్‌ ఇన్‌ చైనా షాప్‌ (సున్నితత్వం, జాగ్రత్త అవసరమైన పరిస్థితుల్లో ఉద్రేకంగా, విపరీతంగా వ్యవహరించడం)లా వ్యవహరిస్తున్నారని ఈ సమయంలో అశోక్‌భాన్‌ వ్యాఖ్యలు చేయడం పట్ల ఏజీ శ్రీరామ్‌ తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానించే రీతిలో మాట్లాడటం తగదని, పిటిషన్లలో లేని విషయాల గురించి ఇలా మాట్లాడటం సబబు కాదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... వాళ్లు చెప్పేది చెప్పనివ్వండి. వాళ్లు చెప్పేవన్నీ మేమేం రికార్డు చేయడం లేదు కదా. మీరు చెప్పాల్సిన సమయంలో మీరూ చెప్పండి అంటూ ఏజీని కూర్చోబెట్టింది.

అశోక్‌భాన్‌ తన వాదనలను కొనసాగిస్తూ  వికేంద్రీకరణ పార్లమెంట్, రాష్ట్రపతి స్థాయిలో జరగాల్సిన నిర్ణయమని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బిల్లులపై మండలిలో చర్చ జరుగుతోంది కదా. మీకెందుకు అంత తొందర? మండలిని నిర్ణయం తీసుకోనివ్వండి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంటే జోక్యం చేసుకుని స్టే ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉందని అశోక్‌భాన్‌ పేర్కొనటంపై ధర్మాసనం స్పందిస్తూ తాము ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడే చేస్తామని తేల్చి చెప్పింది. ఒకరోజు ఆగితే స్పష్టత వస్తుందని, రెండు బిల్లులపై మండలి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని తెలిపారు. ఇకపై ఈ వ్యాజ్యాలపై ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజే జస్టిస్‌ మహేశ్వరి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top