రాజధాని భూముల్లో సాగుపై వెనకడుగు


వ్యతిరేకత రావడంతో మనసు మార్చుకున్న ప్రభుత్వం  

అంగీకార పత్రాలిచ్చిన భూములకే అనుమతి లేదని వెల్లడి

పత్రాలివ్వని రైతులు సాగు చేసుకోవచ్చు




సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పంటల సాగుకు అనుమతి లేదని ప్రకటించిన ప్రభుత్వం అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో మనసు మార్చుకుంది. అంగీకార పత్రాలు ఇచ్చిన భూములకు సంబంధించి మాత్రమే వచ్చే సీజన్ నుంచి సాగుకు అనుమతి ఉండదని, మిగిలిన భూముల్లో సాగు చేసుకోవచ్చని తాజాగా చెబుతోంది. వచ్చే సీజన్ నుంచి రాజధాని ప్రాంతంలో పంటలు సాగు చేయడానికి అనుమతి లేదని కొద్దిరోజులక్రితం సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్పిన విషయం తెలిసిందే.



అంతకు నెలరోజుల ముందే వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. మరోవైపు గుంటూరు జిల్లా బ్యాంకర్ల సమావేశంలోనూ కలెక్టర్ కాంతీలాల్ దండే ఈ ప్రాంత రైతులకు వచ్చే సీజన్ నుంచి రుణాలివ్వొద్దని స్పష్టంగా సూచించారు. అయితే సీఆర్‌డీఏ కమిషనర్ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలు విరుచుకుపడ్డాయి. విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట రైతులతో కలసి కాంగ్రెస్, సీపీఐ నేతలు ధర్నాలు నిర్వహించారు. తొలినుంచీ రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్న జన చైతన్య వేదిక దీనిపై తీవ్ర విమర్శలు చేసింది.



మరోవైపు రాజధాని ప్రాంత రైతుల్లోనూ భయాందోళనలు వ్యక్తమయ్యాయి. భూమి ఇవ్వకపోతే ఆ తర్వాత మిగిలిన భూముల్లో సాగుకూ అవకాశం లేదని చెప్పడం ద్వారా రైతులను బెదిరించి పని కానిచ్చుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. పంటల సాగుకు అనుమతి లేదని చెప్పడంతో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలోని 34 వేల ఎకరాల భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలను కోసిన తర్వాత భూములను వదిలేసి ఆ తర్వాత ఏంచేయాలనే ఆందోళన రైతులను వెంటాడింది.



ఈ నేపథ్యంలో గ్రామాల్లో రైతులు టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తుండడం, వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. భూసమీకరణ చేయడమే ఇబ్బందికరంగా మారగా.. ఇప్పుడు పంటల సాగుపై ఆంక్షల వ్యవహారం మరింతగా ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని భయపడి వెనక్కు తగ్గింది. కేవలం అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లోనే సాగుకు అనుమతి ఉండదని చెబుతోంది. ఈ విషయం గురించి ఇప్పుడిప్పుడే గ్రామాల్లో అధికారులు, టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.



అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లో సాగుకే అనుమతి ఉండదు: సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్

సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లో మాత్రమే పంటలకు అనుమతి లేదని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంగీకార పత్రాలు ఇచ్చిన తర్వాత సంబంధిత భూమి ప్రభుత్వం స్వాధీనంలోకి వస్తుందని, ఆ తర్వాత రైతు, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం జరుగుతుందని తెలిపారు. ఈ ఒప్పందం జరిగిన నాటి నుంచి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వర్తిస్తుందని ఆయన చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top