బెల్టు తీయాల్సిందే | Sakshi
Sakshi News home page

బెల్టు తీయాల్సిందే

Published Wed, Jun 19 2019 10:43 AM

AP Government Strict Action  On Belt Shops - Sakshi

సాక్షి,గుడివాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యనిషేధంపై తీసుకున్న నిర్ణయంలో భాగంగా బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతూ తొలి అడుగు వేశారు. ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా బృందాలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో బెల్టు షాపులకు తావు లేకుండా పోతోంది.

గత ప్రభుత్వం బెల్టుషాపుల నియంత్రణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడంతో గ్రామాల్లో మద్యం ఏరులై పారింది.  ప్రతి గ్రామంలో గుడి, బడి, గ్రామ శివారులో బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉండేవి. బెల్టుషాపుల వల్ల కష్టజీవులు తమ కష్టాన్ని మద్యానికి తగలేయడమే కాకుండా పచ్చని కాపురాల్లో చిచ్చు రేపి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుదేలై రోడ్డున పడ్డాయి. ఎంతోమంది అనారోగ్యం పాలై ఆస్ప్రతుల్లో చేరారు.

ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తిగా...
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా అనేకమంది పేదలు మద్యం ద్వారా తమ కుటుంబాలు ఏవిధంగా నాశనం అవుతున్నాయో జగన్‌ వద్ద తమగోడును వివరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి కష్టాలను కళ్లారా చూశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే మద్యం మహమ్మారిని తరిమికొడతానని మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే బెల్టుషాపులు ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి గ్రామాల్లోని బెల్టుషాపులపై దాడులు నిర్వహిస్తూ, కేసులు నమోదు చేస్తూ, వాటిని నియంత్రిస్తున్నారు. 

నియోజకవర్గంలో 200లకు పైగా బెల్టుషాపుల తొలగింపు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్‌ అధికారులు ఇప్పటికి 200లకు పైగా బెల్టుషాపులను తొలగించారు. బెల్టుషాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి బెల్టుషాపులు నిర్వహిస్తే చట్టప్రకారం తీసుకునే చర్యలు వివరించారు. గుడివాడ మండలంలో 79, గుడ్లవల్లేరు మండలంలో 68, నందివాడ మండలంలో 53కు పైగా బెల్టుషాపులు నిర్వహించే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నారు.  
 

 
Advertisement
 
Advertisement