
వారికి నెలనెలా ఇచ్చే రూ.1000 గౌరవ వేతనాన్ని రూ. 3000 పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం అందించే ఏజన్సీలకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. వారికి నెలనెలా ఇచ్చే రూ.1000 గౌరవ వేతనాన్ని రూ. 3000లకు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మధ్యాహ్న భోజన పథకం-అక్షయపాత్ర, పాఠశాలల మౌలికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నాతాధికారులతో సమీక్షించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించారు. ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మళ్లీ సమావేశం కావాలని స్పష్టం చేశారు.
ఇకపై ఈ పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయ పాత్ర’ గా పిలుస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 లక్షలకుపైగా విద్యార్థులున్నారని, వీరంతా పాఠశాలలకు పూర్తిస్థాయిలో హాజరు కావాలని, అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, అక్షయపాత్ర నిర్వాహకులు సత్యగౌడ చంద్రదాస్, వంశీధర దాస, నిష్కింజన దాస పాల్గొన్నారు.