మృత్యు ఘోష!

AP continues to be home to the highest number of HIV-related deaths in the country - Sakshi

హెచ్‌ఐవీ బాధితుల మరణాల్లో మనదే మొదటి స్థానం

గడిచిన మూడేళ్లలో 37,199 మంది మృతి సగటున రోజుకు 34 మంది మృతి చెందుతున్న పరిస్థితి జబ్బుపై అవగాహన, నియంత్రణలో కేరళ గణనీయమైన పురోగతి 

సాక్షి, అమరావతి: హెచ్‌ఐవీ బాధితుల మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో మన రాష్ట్రంలో 37,199 మంది మృతి చెందారు. అంటే సగటున రోజుకు 34 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితి మరే రాష్ట్రంలో లేదు. ఇదేదో సర్వే చేసి ఇచ్చిన నివేదిక కూడా కాదు. లోక్‌సభలో ఓ సభ్యుడి ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానమిది. గత ఐదేళ్లలో ఏపీశాక్స్‌ (ఏపీ ఎయిడ్స్‌ నియంత్రణ మండలి) జబ్బు నియంత్రణకు, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏపీశాక్స్‌ నిర్వహణ దారుణంగా ఉంది. దీని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి లేకపోవడం, మందుల సరఫరా సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో ఎక్కువ మంది బాధితులు మృతి చెందుతున్నారు. కౌన్సెలింగ్, స్క్రీనింగ్, టెస్టింగ్‌ పద్ధతులు పూర్తిగా గాలికొదిలేశారు. కొన్నిసార్లు ఏఆర్‌టీ (యాంటీ రిట్రో వైరల్‌) సెంటర్లలో బాధితులకు మందులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేని దారుణ పరిస్థితి ఉంటోందని బాధితులు వాపోతున్నారు. 
నియంత్రణలో దక్షిణాదిలో కేరళ భేష్‌ 
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఎయిడ్స్‌ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. హెచ్‌ఐవీ వ్యాధిపై అద్భుతంగా అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన వైద్యమందించడంలో సఫలీకృతమయ్యారు. అందుకే కేరళలో తక్కువ మృతులు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల మంది పైనే హెచ్‌ఐవీ బాధితులున్నట్టు అంచనా. అయితే రికార్డుల్లో 3.50 లక్షల మందే ఉన్నారు. వీరిలో ఏఆర్‌టీ సెంటర్లలో కేవలం 1.70 లక్షల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. చాలా మంది తమపై వివక్ష చూపుతున్నారన్న కారణంగా  మందులకు రాలేకపోతున్నారు. 

ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి 
రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలికి ఉద్యోగులే బలం. ఈ శాఖలో 1200 మందిపైనే పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు వీరే చూస్తారు. అయితే గడిచిన ఐదేళ్లలో తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, 15 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసం కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదని వాపోతున్నారు. ఇలా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం  పథకం అమలుపై ప్రభావం పడుతున్నట్లు  ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top