అసెంబ్లీ ముట్టడి విఫలం 

AP Assembly Blockade Was Became Failure - Sakshi

పోలీసులపై టీడీపీ శ్రేణుల రాళ్ల దాడి

ఎస్సై సహా పలువురు పోలీసులకు గాయాలు

సంయమనంతో విధులు నిర్వహించిన సిబ్బంది

సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు/తుళ్లూరు/తుళ్లూరు రూరల్‌: అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణులు చేసిన యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం శాసనసభ సమావేశాల నేపథ్యంలో టీడీపీ, వామపక్షాలు, అమరావతి జేఏసీ చేపట్టిన ఛలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడికి పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు రాళ్లతో దాడికి దిగారు. రాళ్ల దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు, పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం పొలాల్లో నుంచి సచివాలయం వైపు చొచ్చుకుని వచ్చేందుకు చేసిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులను మహిళలు తీవ్ర దుర్భాషలాడారు. ఎర్రబాలెంలో స్పృహ కోల్పోయిన మల్లీశ్వరి అనే మహిళకు మంచినీరు అందించి పోలీసులు సేవలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేశారు.  

రెచ్చగొట్టేలా టీడీపీ మెసేజ్‌లు 
అసెంబ్లీ ముట్టడికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టీడీపీ నేతలు వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు ఏమైపోయారు? 5 లక్షల మందితో అసెంబ్లీని ముట్టడించాలి. లేదంటే రాష్ట్రంలో బతకడమే దండగ’ అంటూ టీడీపీ నేతలు రెచ్చగొడుతూ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టారు. గుంటూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటి ముందు నిరసనకు దిగిన టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.  

రాళ్లు  తగిలి కింద పడిపోతున్న పోలీసు 

సహనంతో పోలీస్‌ వ్యూహం 
బయటి ప్రాంతాల నుంచి అమరావతి చేరుకున్న వ్యక్తులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆదివారం రాత్రి ఇంటెలిజెన్స్‌ వర్గాలు సమాచారం అందించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో చెక్‌పోస్టులు, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాలను బాంబ్‌స్క్వాడ్‌ బృందాలతో జల్లెడ పట్టారు. పోలీసు బలగాలు శాంతి, సహనంతో వ్యవహరించి అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేశాయి. 

గల్లా జయదేవ్‌పై కేసు 
రాజధాని ప్రాంతంలో 30 పోలీస్‌ యాక్ట్, సెక్షన్‌ 144 అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగి రైతులు, ఆందోళనకారుల ముసుగులో పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో ముట్టడికి యత్నించిన ఎంపీ గల్లా జయదేవ్‌పై 143, 332, 188, 353, 323, 324, రెడ్‌/149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జయదేవ్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఐజీ బ్రిజ్‌లాల్‌ను కాపాడే యత్నంలో ఆక్టోపస్‌ ఎస్సై ఒకరు గాయపడ్డారు. పలు చోట్ల రాళ్ల దాడుల్లో గాయపడ్డ పోలీస్‌ సిబ్బంది వి.నగేష్, గొట్టె లింగా, హరీశ్, పి.వేణుగోపాలరావు, బి.చక్రధర్, పి.ఏసురాజును ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ వెనుక పొలాల్లో నుంచి సుమారు 600 మంది ఆందోళనకారులు పోలీసులపై ఒక్కసారిగా రాళ్లతో దాడిచేశారని గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావు తుళ్లూరులో మీడియాతో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై 353, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top