
‘ఉపాధ్యాయ’ కోర్సులకు వార్షిక కేలండర్
ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వార్షిక కేలండర్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
* మూడు నెలల ముందుగానే ప్రకటించాలని కేంద్రం స్పష్టీకరణ
* బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులే
* డిగ్రీ, పీజీ కాలేజీల్లోనూ ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు
* 3కొత్త నిబంధనలపై మార్గదర్శకాలను రూపొందిస్తున్న ఎస్‌సీఈఆర్‌టీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వార్షిక కేలండర్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీకరణ, ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల షెడ్యూల్(కేలండర్)ను మూడు నెలల ముందుగానే ప్రకటించాలని, రాష్ట్రాలు దీన్ని కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. అలాగే ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సును గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో చేయవచ్చని నిబంధనలను సరళీకరించింది. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెస్తూ కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో మార్గదర్శకాల రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేవాల్సిన మార్గదర్శకాలను రూపొందించి రాష్ర్ట ప్రభుత్వ ఆమోదం పొందాలని నిర్ణయించింది.
ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రధాన మార్పులు
ఉపాధ్యాయ విద్యా కాలేజీ ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) నిరభ్యంతర పత్రాన్ని కోరుతుంది. ఈ లేఖ వచ్చిన 45 రోజుల్లోగా రాష్ట్రం తన నిర్ణయాన్ని తెలియజేయాలి. లేకపోతే తుది నిర్ణయం ఎన్‌సీటీఈదే.
కొత్త కాలేజీల్లో ఒక్క బీఎడ్ కోర్సునే ప్రారంభించడానికి వీల్లేదు. రెండు మూడు రకాల కోర్సులను ప్రవేశ పెట్టాలి. పాత కాలేజీలు కూడా క్రమంగా ఇతర కోర్సులను ప్రవేశపెట్టాలి. డిగ్రీ, పీజీ కాలేజీల్లోనూ ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను ప్రవేశపెట్టవచ్చు.
అద్దె భవనాల్లో కాలేజీ ఏర్పాటు కుదరదు. సొంత భవనమైతేనే ఇకపై అనుమతిస్తారు. కాలేజీ పేరుతోనే భూమి రిజిస్టర్ అయి ఉండాలి. కాలేజీలకు ఐదేళ్లకోసారి నాక్ తరహా గుర్తింపు తప్పనిసరి.
కొత్త కాలేజీల అనుమతులు, పాత కాలేజీల రెన్యువల్స్ మొత్తాన్ని ఏటా మార్చి 1వ తేదీ నుంచి మే 31లోగా పూర్తి చేయాలి.
బోధన, బోధనేతర సిబ్బందికి బ్యాంకు అకౌంట్ ద్వారానే వేతనాలు చెల్లించాలి. ఈపీఎఫ్ అమలు చేయాలి. ఉద్యోగుల ఫొటోలతో సహా కాలేజీ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. ప్రవేశాలు పూర్తయిన రెండు రోజుల్లో విద్యార్థుల జాబితాను అఫిలియేషన్ ఇచ్చే సంస్థకు పంపించాలి. కాలేజీ వెబ్‌సైట్‌లోనూ పెట్టాలి. దాన్ని ఎన్‌సీటీఈ వెబ్‌సైట్‌కు లింక్ చేయాలి.
రాష్ట్రంలో తెలుగు, ఉర్దూ, హిందీ పండిత శిక్షణ కోర్సులు ఉన్నాయి. కానీ వీటికి ఎన్‌సీటీఈ నుంచి గుర్తింపు లేదు. తాజా నిబంధనల్లోనూ ఈ కోర్సులను గుర్తించలేదు. దీంతో వీటి కొనసాగింపును తేల్చాలంటూ త్వరలో ఎన్‌సీటీఈకి లేఖ రాయాలని ఎస్‌సీఈఆర్‌టీ నిర్ణయించింది. దూరవిద్యలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వంటి కోర్సుల నిర్వహణ, ఇతర నిబంధనలన్నింటి అమలుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది.