‘సంచలనాత్మక నిర్ణయాలు అమలు చేశారు’

Andhra Pradesh Incarnation Day Celebrations In Visakhapatnam - Sakshi

విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, గొల్ల బాబూరావు, విఎంఆర్‌డిఎ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రం.. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటుకు మహానుభావుడు పొట్టి శ్రీరాములు చేసిన కృషి అనిర్వచనీయం అని  పేర్కొన్నారు. ఆయన  చేసిన త్యాగాన్ని నేడు స్మరించుకోవాల్సిన రోజు అని అన్నారు.

సంచలన నిర్ణయాలు అమలు చేశారు..
కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే సంచలనాత్మమైన నిర్ణయాలు అమలు చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా సచివాలయాల ఉద్యోగాల భర్తీ అత్యంత చారిత్రాత్మకం అని కొనియాడారు. గత నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని వెల్లడించారు. పాడేరులో త్వరలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు కాబోతోందని తెలిపారు. విశాఖ నగర వాసులకి తాగునీటి సమస్య తీర్చేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. విశాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని కలెక్టర్‌ తెలిపారు.

గత ప్రభుత్వం విస్మరించింది..
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. అమరజీవి పొట్టి శ్రీరాములను స్మరించుకోవడానికే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. నేడు తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజు అని వెల్లడించారు.

పవిత్రదినంగా పాటించాలి..
ఆంధ్రులకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. నవంబర్‌ 1ని పవిత్ర దినంగా పాటించాలని సూచించారు.

చరిత్రలో నిలిచిపోయిన రోజు..
‘నవంబర్‌ 1’ చరిత్రలో నిలిచిపోయిన రోజు అని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. నాడు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖపట్నం అభివృద్ధి జరిగిందని గుర్తుచేశాడు. నేడు సీఎం వైఎస్ జగన్ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ప్రతి ఏటా స్మరించే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్ కల్పించారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top