విశాఖ: ఏపీలో జంగిల్ రాజు ప్రభుత్వం నడుస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీడీపీ గూండాలు వ్యవహరించారన్నారు.
‘మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టిడిపి గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 1000 మందికి పైగా వెళ్లి హత్యా చేయాలని ప్లాన్ చేశారు. రోజులన్నీ ఒకేలా ఉండవు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. వడ్డీతో సహా మీకు తిరిగి ఇచ్చేస్తాం. కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబును చంపాలని చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాంబాబుని చంపాలని చూశారు.
కాపులను చంపడం టీడీపీకి కొత్తమీ కాదు. గతంలో ముద్రగడ పద్మనాభంను చంపాలని చూశారు.నేడు అంబటి రాంబాబును చంపాలని చూస్తున్నారు. మీ దాడులను చూస్తూ వైఎస్ఆర్సిపి ఊరుకోదు’ అని హెచ్చరించారు.


