అమూల్‌‌తో అవగాహన ఒప్పందంపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh Government Is Going To Sign MOU With Amul - Sakshi

రేపు అమూల్‌తో అవగాహన ఒప్పందం

సాక్షి, తాడేపల్లి: అమూల్‌‌తో అవగాహన ఒప్పందం నేపధ్యంలో క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీసీఎఫ్‌) ఎండీ వాణీ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవగాహన ఒప్పందంలోని అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి రంగంలో కీలకపాత్ర పోషించనుందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా పాడి రైతులను ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకురావడంలో ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. మహిళల సాధికారతకు తోడ్పాటునందిస్తుందని వెల్లడించారు. మొత్తంగా డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుందన్నారు.

పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన  పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రంలో పాడిపరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా.. వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. మహిళలు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడిపరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఆ పరిశ్రమల్లో వారికున్న అవకాశాలను పరిశీలించి మహిళలను ముందుకు నడిపించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.  (కరోనా నివారణకు సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top