‘ఏబీ’ని కాపాడేందుకు వివాదాస్పద జీవో

Andhra Pradesh Government Controversial GO - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు బుధవారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం వివాదాస్పద జీవో జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ సీఈసీ పరిధిలోకి తెచ్చింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేవరకూ పోలీసు యంత్రాంగం సీఈసీ పరిధిలో పనిచేయనుంది. అయితే ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈసీ పరిధిలోకి ఎవరు వస్తారనే దానిపై జీవో 721 జారీ చేసింది.

సీఈసీ ఆదేశాలతో వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను రిలీవ్‌ చేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 విడుదల చేసింది. తెల్లారేసరికి ప్లేటు మార్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారని మెలిక పెట్టింది. నిన్నటి జీవోను రద్దు చేస్తూ నేడు వివాదాస్పద జీవో 720 జారీ చేసింది. ఇవాళ్టి జీవోలో వెంకటేశ్వరరావు పేరును తప్పించింది. ఆయనను రిలీవ్‌ చేయడం లేదని.. వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను మాత్రమే రిలీవ్‌ చేస్తున్నట్టు అందులో పేర్కొంది.

ఈసీ పరిధిలో లేకుండా వెంకటేశ్వరరావును తప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చివరివరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతోంది. 24 గంటల వ్యవధిలో మూడు జీవోలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బదిలీని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను మార్చే హక్కు ఈసీకి లేదని పిటిషన్‌లో పేర్కొంది. ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. (చదవండి: ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top