రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌ | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌

Published Fri, Apr 19 2019 11:49 AM

Andhra Pradesh EAMCET Exams From Tomorrow - Sakshi

చిత్తూరు, తిరుపతి ఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్‌ విద్యలో ప్రవేశానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏపీ ఎంసెట్‌ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారిత) ద్వారా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 20 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్,  23, 24వ తేదీల్లో అగ్రికల్చర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ రెండింటికీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 23, 24వ తేదీల్లో పరీక్ష ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు.

23,051మంది దరఖాస్తు
జిల్లావ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడిసిన్‌కు 23,051మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్‌కు 14,409మంది, అగ్రికల్చర్‌కు 8,642మంది, మొత్తం 23,051మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్, ఏపీ ఎంసెట్‌–2019 కన్వీనర్‌  సీహెచ్‌ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.  విద్యార్థి హాల్‌ టికెట్‌లోనే పరీక్ష తేదీ, సమయం ఉంటాయని, దీనిని గుర్తుంచుకుని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎంసెట్‌ హాల్‌ టికెట్‌తో పాటు ఇంటర్‌ హాల్‌ టికెట్, ఓటరు ఐడీ, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్‌ కార్డుల్లో ఏదేని ఒక గుర్తింపు కార్డు, బాల్‌పాయింట్‌ పెన్, ఎంసెట్‌ దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించమని స్పష్టంచేశారు. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 1.30గంటల నుంచే విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్‌లో ఇచ్చిన సూచనలు, జాగ్రత్తలను విద్యార్థులు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఏపీ ఎంసెట్‌–2019కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 0884–2340535, 0844–2356255 నంబర్లలో సంప్రదించాలని, అలాగే 2019 apeamcet@fmai.com మెయిల్‌ ద్వారా సంప్రదించాలని కన్వీనర్‌ సూచించారు.

జిల్లాలో 10పరీక్ష కేంద్రాలు
ఎంసెట్‌ పరీక్ష నిర్వహణకు జిల్లాలో 10పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. చిత్తూరులో ఒకటి, మదనపల్లిలో 2, పుత్తూరులో 3, తిరుపతిలో 4, మొత్తం 10 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు.

చిత్తూరులో..
1. వేము ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

మదనపల్లెలో..
2. ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల
3. మదనపల్లె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌సైన్సెస్‌

పుత్తూరులో..
4. సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌టెక్నాలజీ
5. శ్రీవేంకటేశ పెరమాళ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌అండ్‌ టెక్నాలజీ
6. కేకేసీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌

తిరుపతిలో..
7. అయాన్‌ డిజిటల్‌ జోన్, రామిరెడ్డిపల్లి
8. అయాన్‌ డిజిటల్‌ జోన్, జూపార్కు సమీపం
9. అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ  అండ్‌ సైన్సెస్‌
10. ఎస్వీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌

Advertisement
Advertisement