వాహనంలో అనుమతించిన సంఖ్య కంటే అదనంగా మనుషులు ఉన్నారన్న కారణంగా బీమా మొత్తాన్ని తిరస్కరించడం సరికాదని బీమా సంస్థలకు రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది.
హైదరాబాద్: వాహనంలో అనుమతించిన సంఖ్య కంటే అదనంగా మనుషులు ఉన్నారన్న కారణంగా బీమా మొత్తాన్ని తిరస్కరించడం సరికాదని బీమా సంస్థలకు రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. మనుషుల ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఉండదని, ఈ నేపథ్యంలో సంఖ్యను ఎలా సాకుగా చూపుతారని ప్రశ్నించింది. వాహనంలో ఒక్కరే ఉండాలని, ఆరుగురు ఉన్నారన్న కారణంగా బీమా మొత్తాన్ని తిరస్కరించడం సరికాదని తేల్చిచెప్పింది.
విద్యుత్‌ఘాతం కారణంగా పూర్తిగా కాలిపోయిన బోర్‌వెల్ వాహనానికి రూ.37.5 లక్షలను 12 శాతం వడ్డీతో నాలుగు వారాల్లో చెల్లించాలని ఫోరం సభ్యులు ఆర్.లక్ష్మీనరసింహారావు, టి.అశోక్‌కుమార్, ఎస్.భుజంగరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. అలాగే ఇతర ఖర్చుల కింద మరో రూ.35 వేలు ఇవ్వాలని తీర్పులో స్పష్టం చేసింది.
నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సీతా కళావతి బోర్‌వెల్ వాహనానికి 2012 ఏప్రిల్ 18న ఏడాది కాలానికి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో బీమా పాలసీ తీసుకున్నారు. 2012 నవంబర్ 19న బోర్ వేసేందుకు వెళ్తున్న వాహనం విద్యుత్‌ఘాతానికి గురై పూర్తిగా కాలిపోయింది. పాలసీ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ బీమా మొత్తం రూ.45 లక్షలు చెల్లించాలని కోరినా రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ స్పందించడం లేదంటూ సీతాకళావతి ఫోరంను ఆశ్రయించారు.