మానవతా దృక్పథంతో ఆదుకుందాం

Anantapur Collector Request to People on Funds For Poor People - Sakshi

అనంతపురం: నిరాశ్రయులు, పేదలు, యాచకులు, దినసరి కూలీలు, భవన కార్మికులు తదితరులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు కోరారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో కోవిడ్‌–19 జిల్లా ప్రత్యేక అధికారి టి.బాబూరావునాయుడు, జేసీ డిల్లీరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవితో కలిసి అనంతపురంలోని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ హోటళ్ల యాజమాన్యాలు, ఆర్యవైశ్య సంఘం, ఆర్‌డీటీ, ఇస్కాన్‌ తదితర సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తినడానికి తిండి కరువైన ప్రజలు, కూలీ నాలి చేసుకొని జీవించే పేదలకు రెండు పూటల భోజనం సమకూర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే ఈ విషయంపై అవసరమైన చర్యలు తీసుకుందన్నారు. భోజనంతో పాటు పండ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు. మెప్మా ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇలాంటి సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఏపీ ప్రాథమిక విద్య నియంత్రణ మండలి కమిషన్‌ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్ర, మెప్మా పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top