
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాలనలో తనదైన ముద్రను కనపరుస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూనే ప్రజలకు దగ్గరయ్యే దిశగా నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ ప్రత్యేక పోస్టర్‌ను రూపొందించారు. ‘‘ఈ కార్యాలయం మనందరిది. అధికారులను కలిసే సమయంలో ఇలాంటి పనులు చేయకండి’’ అని ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
కలెక్టర్ గంధం చంద్రుడు రూపొందించిన పోస్టర్
‘‘చెప్పులు విడవకండి.. మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకుని నిలబడకండి. కన్నీరు పెట్టుకోకండి. కాళ్లు మొక్కకండి. ఆత్మగౌరవంతో మీ సమస్యను స్పష్టంగా వివరించండి.’’ అని తెలియజేసే పోస్టర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా దూసుకుపోతున్నాయి. ఈ పోస్టర్లను జిల్లాస్థాయి కార్యాలయాలతో పాటు ప్రతి మండల కార్యాలయాలకు పంపి ప్రజలకు కనిపించే విధంగా అతికించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ వినూత్న పోస్టర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.