‘అమ్మ’ భాషను ప్రోత్సహించా | 'Amma' to promote language | Sakshi
Sakshi News home page

‘అమ్మ’ భాషను ప్రోత్సహించా

Aug 30 2013 4:44 AM | Updated on May 28 2018 4:09 PM

తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినకర్‌బాబు పిలుపునిచ్చారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినకర్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతివేగంగా కనుమరుగవుతున్న భాషలో తెలుగు ఉండటం శోచనీయమన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ  మాతృ భాషలో విద్యాబోధన చేపట్టడం వల్ల చెప్పాలనుకున్న విషయాన్ని విద్యార్థులకు సులభంగా చెప్పవచ్చన్నారు. 
 
 తెలుగు భాష సంస్కృతి, గొప్పతనాన్ని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బోధించాలన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గిడుగు రామమూర్తి వంటి కవులు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తెలుగు భాషలోని కఠిన పదాలను వాడుక భాషలోకి మార్చి అందరికి అర్థమయ్యేలా గిడుగు రామమూర్తి విశేష కృషి చేశారన్నారు. ఏజేసీ మూర్తి మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అనే విధంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెలుగు నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. 
 
 నన్నయ్య, తిక్కయ్య, ఎర్రప్రగడ వంటి వారు భాషాభివృద్ధికి సాహితీ పరంగ విశేష కృషి చేశారన్నారు. డీఈఓ రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ప్రకటనలు తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు భాషకు కృషి చేసిన ఉపాధ్యాయులు ఎండీ షరీఫ్, ఉండ్రాల్ల రాజేశం, సంపత్‌కుమార్ తెలుగులో పది పాయింట్లు సాధించిన ప్రత్యుష తండ్రిని కలెక్టర్ సన్మానించారు. సమావేశంలో యువజన సంక్షేమ శాఖాధికారి రాంచంద్రయ్య, ఎంఈఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement