ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం

All Set for the swearing-in ceremony - Sakshi

ఉదయం 11.49 గంటలకు ముహూర్తం ఖరారు 

అతిథులకు ప్రత్యేకంగా గ్యాలరీలు, బారికేడ్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు 

సాక్షి, అమరావతి : రాష్ట్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదిక సిద్ధమైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా వేదిక వద్ద ప్రత్యేకంగా గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లపై గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం సంబంధిత అధికారులతో చర్చించారు.

అక్కడ జరుగుతున్న పనులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. అత్యంత ప్రముఖులు, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలు వారికి కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా బోర్డులను ఏర్పాటుచేశారు. సచివాలయం వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఆహ్వాన పత్రికలకు వెనుక భాగాన రూట్‌ మ్యాప్‌ను కూడా ముద్రించారు.  

కూర్చున్న చోటుకే అల్పాహారం 
కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ వారు కూర్చున్న ప్రాంతంలోనే అల్పాహారం, తాగునీరు అందించాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించేందుకు వీలుగా ప్రాంగణంలో ఎల్‌ఇడి తెరలను ఏర్పాటుచేశారు. 1500 మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటుచేసింది. ఈ ఏర్పాట్లను డీజీపీ సవాంగ్, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా పర్యవేక్షించారు.   

మంత్రుల ప్రమాణ స్వీకార సభ ప్రాంగణం దిగువన నవరత్నాల చిహ్నాలు సిద్ధం చేస్తున్న సిబ్బంది 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top