ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్ 2015ను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు.
ఏయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్ 2015ను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 78,755 మంది హాజరుకానున్న ఈ పరీక్షకు 16 రీజినల్ కేంద్రాల పరిధిలో 136 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ రీజియన్‌లో అత్యధికంగా 88,896, కుప్పం రీజియన్ నుంచి అత్యల్పంగా 347 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, హాల్‌టికెట్లు అందని వారు ప్రాంతీయ సమన్వయకర్తలను సంప్రదించాలన్నారు. రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, రూ. 50 నగదు చెల్లించి హాల్ టికెట్లను పొందవచ్చని తెలిపారు.