వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలు

Agriculture Advisory Board In AP Says CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : వైద్య, విద్యా, ఆరోగ్యంలో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా వ్యవసాయ రంగంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ మండళ్లు ఏర్పాటు కానున్నాయి. మార్కెట్ ఇంటెలిజెన్స్‌కు అనుగుణంగా పంటల విస్తరణ, పంట మార్పిడి వంటి అంశాల్లో రైతులకు సలహాలిచ్చేందుకు ఈ సలహా మండళ్లు ఏర్పాటు చేయబడుతున్నాయని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్రంలోని రైతులకు మేలు చేసే సంస్కరణలు, పద్దతులు సూచించేందుకు మండళ్లు ఏర్పాటు కానున్నాయి. (3,57,51,612 మందికి లబ్ది)

వ్యవసాయశాఖ మంత్రి చైర్మన్‌గా..
రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మండళ్లు సలహాలు, సూచనలు ఇవ్వనున్నాయి. ఇక రాష్ట్ర స్థాయిలో వ్యవసాయశాఖ మంత్రి ఈ సలహా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అధికారులు, రైతు ప్రతినిధులు, వివిధ విభాగాల ప్రతినిధులతో కలిసి మొత్తం 27 మంది ఉండేలా దీనిని రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రి చైర్మన్ గా, కలెక్టర్ వైస్ ఛైర్మన్‌గా నియమితులు కానున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, రైతు ప్రతినిధులతో జిల్లా సలహా మండలి ఏర్పాటు కానుంది. ఇక మండల స్థాయిలో ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో మండలస్థాయి అధికారులు, రైతులు ప్రతినిధులుగా ఉండనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారే అవకాశం ఉందని రైతు సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (జనరంజక పాలన; జనం స్పందన)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top