రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన తర్వాత జరుగుతున్న మహానాడులో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై సవివరమైన సమీక్ష జరుగుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురయ్యింది.
మహానాడులో అవే ప్రసంగాలు..
► రాజకీయ అంశాలపై స్పష్టత ఇవ్వని బాబు
► అధినేత మొదలు నేతలందరిదీ అదే తీరు
విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన తర్వాత జరుగుతున్న మహానాడులో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై సవివరమైన సమీక్ష జరుగుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురయ్యింది. ఏం చేయకపోయినా.. ఏదో చేసినట్లు, ఏవేవో ఘన‘కార్యాలు’ సాధించినట్లు గొప్పలు చెప్పుకోవడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమయ్యింది. మహానాడు ఎప్పటి మాదిరిగానే పూర్తిగా భజన వేదికగా మారిపోయిందన్న విమర్శలు వినిపించాయి. అధినేత చంద్రబాబును కీర్తించడం, రాష్ట్రంలో పార్టీ ఘనకార్యాలయాలు చేసిందంటూ ఊదరగొట్టడం, ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం మినహా ఎక్కడా కొత్తదనం కనిపించలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యమైన అంశాలు విడిచిపెట్టి..
ప్యాకేజీ కోసమే ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టిన చంద్రబాబు తాజాగా ప్యాకేజీ విషయంలోనూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారని పరిశీలకులు పేర్కొంటున్నారు. హోదా కోసం తాను ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఆ బాధ్యతను విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే కాక ఇపుడు నెపాన్ని పూర్తిగా కేంద్రంపై నెట్టేసేందుకు ప్రయత్నించడం విశేషం. విభజన చట్టంలోని అంశాల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా, నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుం డా మహానాడులో ఊకదంపుడు ప్రకటనలతో నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిం చడం స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులంటున్నారు. పార్టీకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంత దీనస్థితిలో ఉందో చెప్పకనే చెప్పారు. ఇక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఎన్టీఆర్ జపం చేయడం కొసమెరుపు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబునాయుడు మహానాడు ప్రసంగాలలో డిమాండ్ చేయడం తప్ప అందుకోసం ఆ తర్వాత చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు.
యథాప్రకారం అవే విషయాలు...
చంద్రబాబునాయుడు యధాప్రకారం గంటన్నరసేపు మాట్లాడడం బోర్ కొట్టించిందని కార్యకర్తలే వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే కార్యకర్తలు, నాయకులు అటూ ఇటూ తిరగడం, తమలో తాము చర్చించుకోవడం కనిపించింది. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే చాలామంది సభ మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుత రాజకీయాలు, తెలుగుదేశం అనుసరిస్తున్న వైఖరిపై కార్యకర్తలు, నాయకుల్లో అనేక అనుమానాలున్నా వాటిని నివృత్తి చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు ఏమాత్రం చేయలేదు. ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్‌తో మొదలు పెట్టి అన్ని సమీక్షల్లోనూ చెప్పే పాత విషయాలనే ఇక్కడా ఒకటికి రెండుసార్లు చెప్పడంతో ఆ పార్టీ నేతలు ఇక్కడా అదే గోలా అని చర్చించుకోవడం కనిపించింది. రెండురోజులపాటు కలెక్టర్ల సదస్సులో చెప్పిన విషయాలనే ఇక్కడా చెప్పారు. పార్టీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పాత పల్లవినే వినిపించారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా దానివల్ల ఏమీ ఒరగదని, అందుకే దానికి సమానమైన ప్యాకేజీ తీసుకున్నామన్నారు. ఇక టీడీపీ నేతలు వర్ల రామయ్య, తెలంగాణ నేత అమర్‌నాథ్ తదితరులు సుదీర్ఘంగా ప్రసంగించి విసుగెత్తించారు.
మేనిఫెస్టో హామీలపై అబద్దాలు
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసినట్లు మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు అబద్దాలు వల్లె వేశారని విమర్శకులంటున్నారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, దీంతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పదేపదే చెప్పినా కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందనా కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మహానాడుకు 26 వేల మంది వస్తారని ప్రచారం చేసినా ఆ స్థాయిలో కార్యకర్తలు రాలేదు. పది వేల మంది కూడా రాలేదని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. వచ్చిన వారు కూడా చాలామంది సభలోకి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. టీడీపీ తెలంగాణ నాయకుడు రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడు కార్యకర్తలు పెద్దగా కేకలు వేసి స్పందించడంతో చంద్రబాబునాయుడు అసహనంగా చూడడం చర్చనీయాంశమైంది. మహానాడు జరుగుతున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో సరిపడా బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో టీడీపీ కార్యకర్తలు పరిసర ప్రాంతాలన్నింటినీ యధేచ్చగా వాడేసుకున్నారు.