మళ్లీ ఉద్యోగుల సమైక్య సమరం | Again employees movement | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉద్యోగుల సమైక్య సమరం

Feb 5 2014 5:29 AM | Updated on Aug 18 2018 4:13 PM

రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటుకు రానుండడంతో.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటుకు రానుండడంతో.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈనెల 6వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు విధులకు స్వస్తి పలకనున్నారు. 17, 18 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ సమైక్య రాష్ట్ర ఆవశ్యకత వివరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

 మంగళవారం సాయంత్రం స్థానిక ఎన్‌జీఓ అసోసియేషన్ హాలులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కార్యకర్గం అత్యవసరంగా సమావేశమైంది. జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రస్తుతం సమైక్య పోరాటం ఆఖరి దశకు చేరుకుందన్నారు.

 రెవెన్యూ ఉద్యోగులంతా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టీరియల్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ స్వాములు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులంతా కేంద్రానికి తమ నిరసన తెలియజేయాలని వైద్య ఆరోగ్యశాఖ నాయకుడు కే శరత్‌బాబు కోరారు. రాష్ట్రం విడిపోతే తలెత్తే నీటి సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌నాసర్ మస్తాన్‌వలి అన్నారు.

సమావేశంలో కో ఆపరేటివ్ ఉద్యోగల సంఘం జిల్లా అధ్యక్షుడు కే వెంకటేశ్వరరెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ నాయకులు ఎం. మూర్తి, పీ మదన్‌మోహన్‌రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి పీ వెంకటేశ్వరరావు,  ప్రభుత్వ ఉద్యోగుల వివిధ సంఘాల నాయకులు గోపాల్,  ఐసీహెచ్ మాలకొండయ్య, పీ రమేష్,  బీ ఏడుకొండలు, సురేష్, రాజశేఖర్, కే శివకుమార్, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఏం చేస్తాయో?
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గత ఏడాది నిర్వహించిన అరవై ఆరు రోజుల నిరవధిక సమ్మెలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. వీరి రాకతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. అయితే ఈ దఫా ఆ రెండు శాఖల నుంచి ఇంకా నిర్ణయం వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement